బీజేపీలో ముదురుతున్న సీట్ల లొల్లి

జహీరాబాద్‌ నుంచి కేంద్ర మాజీ మంత్రి ఆలె నరేంద్ర కుమారుడు ఆలె భాస్కర్, మాజీ మంత్రి బాగారెడ్డి కుమారుడు జైపాల్ రెడ్డి టికెట్ ఆశించారు. అయితే ఇటీవల పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్‌కు టికెట్ ఇచ్చింది హైకమాండ్.

Advertisement
Update:2024-03-05 16:46 IST

తెలంగాణలో 9 మంది లోక్‌స‌భ అభ్యర్థులతో బీజేపీ ప్రకటించిన ఫస్ట్‌ లిస్టుపై వివాదం ముదురుతోంది. ముఖ్యంగా హైదరాబాద్‌, మల్కాజ్‌గిరి, జహీరాబాద్, నాగర్‌కర్నూలు స్థానాల్లో పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సీనియర్లను కాదని, నిన్నా మొన్నా పార్టీలోకి వచ్చిన వారికి టికెట్లు ఎలా ఇస్తారంటూ నేతలు నిలదీస్తున్నారు. ఇక ఫస్ట్ లిస్టులో పేర్లు రాకపోవడంతో ఎంపీ సోయం బాపూరావు, డి.కె.అరుణ, జితేందర్ రెడ్డి తీవ్ర నిరాశలో ఉన్నారు.

తెలంగాణలో మొత్తం 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ. ఇందులో ముగ్గురు సిట్టింగ్ ఎంపీలకు అవకాశం దక్కగా.. నలుగురు కొత్తవారికి చోటు కల్పించింది. మల్కాజ్‌గిరి నుంచి టికెట్ ఆశించిన సీనియర్ నేత మురళీధర్‌రావు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానంటూ ట్వీట్ కూడా చేశారు. ఇక హైదరాబాద్‌ టికెట్ మాధ‌వీలతకు ఇవ్వడంపై సీనియర్లు గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది. గతంలో హైదరాబాద్‌ స్థానం నుంచి పోటీ చేసిన హనుమంతరావుతో పాటు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ లాంటి నేతలు మాధవీలత అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం.

జహీరాబాద్‌ నుంచి కేంద్ర మాజీ మంత్రి ఆలె నరేంద్ర కుమారుడు ఆలె భాస్కర్, మాజీ మంత్రి బాగారెడ్డి కుమారుడు జైపాల్ రెడ్డి టికెట్ ఆశించారు. అయితే ఇటీవల పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్‌కు టికెట్ ఇచ్చింది హైకమాండ్. దీంతో సీనియర్ నేతలు పార్టీ తీరుపై ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక వరంగల్‌ ఎంపీ సీటు బీఆర్ఎస్ నుంచి వచ్చే నేతకు ఇస్తారంటూ ప్రచారం జరగడంతో స్థానిక నేతలు మాజీ మంత్రి విజయరామారావు, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్‌.. కిషన్ రెడ్డికి లేఖ రాశారు. పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా వేరే వారికి టికెట్ ఇస్తే సహకరించేది లేదని లేఖలో పేర్కొన్నారు.

ఇక నాగర్‌కర్నూలు నుంచి ఇటీవల పార్టీలో చేరిన ఎంపీ పోతుగంటి రాములు కుమారుడు భరత్‌ కుమార్‌కు సీటు ఇచ్చింది బీజేపీ. దీంతో ఆ స్థానంపై ఆశలు పెట్టుకున్న బంగారు లక్ష్మణ్ కుమార్తె బంగారు శృతి ఆవేదనకు గురయ్యారు. తర్వాత ఆమె సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిశారు. దీంతో ఆమె పార్టీ మారతారన్న ప్రచారం కూడా జరిగింది.

ఇక పాలమూరు ఎంపీ సీటు విషయంలో డి.కె.అరుణ, జితేందర్ రెడ్డి నువ్వా,నేనా అన్నట్లుగా ప్రయత్నిస్తున్నారు. టికెట్ తనకే దక్కుతుందంటూ జితేందర్ రెడ్డి ట్వీట్లు కూడా చేస్తున్నారు. మరోవైపు టికెట్ కోసం డి.కె.అరుణ కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇక తొలి జాబితాలో సీటు దక్కకపోవడంతో సంచలన వ్యాఖ్యలు చేశారు ఎంపీ సోయం బాపూరావు. టికెట్ ఇవ్వకుంటే తన దారి తాను చూసుకుంటానంటూ కామెంట్స్ చేశారు. సోమవారం నాటి సభలో ప్రధాని మోడీని కలిసి టికెట్ తనకే ఇవ్వాలని సోయం కోరినట్లు సమాచారం.

Tags:    
Advertisement

Similar News