తెలంగాణలో నాయకత్వ వైఫల్యం.. బీజేపీ అధికార ప్రతినిధి సంచలన వ్యాఖ్యలు

బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు మాత్రం తెలంగాణలో నాయకత్వ వైఫల్యం ఉందంటూ కుండబద్దలు కొట్టారు. దక్షిణాదిలో ముఖ్యంగా తెలంగాణలో నాయకత్వ వైఫల్యమే పరాభవాలకు కారణం అని స్పష్టం చేశారు.

Advertisement
Update:2022-11-08 16:44 IST

ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో తెలంగాణ మినహా మిగతా అన్ని చోట్లా బీజేపీకి ఊహించిన ఫలితాలే వచ్చాయి. తెలంగాణలో మాత్రం తలబొప్పి కట్టింది. సిట్టింగ్ ఎమ్మెల్యే హోదాలో బీజేపీ తరపున బరిలో నిలిచిన రాజగోపాల్ రెడ్డి ఘోర పరాభవాన్ని చవిచూశారు. ఏడాదిలోగా అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాల్సిన సందర్భంలో తెలంగాణలో బీజేపీకి ఇది చెంపపెట్టుగా మారింది. కారణం ఏంటి..? రకరకాల విశ్లేషణలతో బీజేపీ నేతలు కబుర్లు చెబుతున్నారు కానీ, రాష్ట్ర బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు మాత్రం ఇది నాయకత్వ వైఫల్యం అంటూ కుండబద్దలు కొట్టారు. దక్షిణాదిలో ముఖ్యంగా తెలంగాణలో నాయకత్వ వైఫల్యమే ఈ పరాభవాలకు కారణం అంటున్నారాయన.

ఉత్తరాది రాజకీయాలు పనిచేయవు..

జాతీయ భావం చూపిస్తూ ఉత్తరాదిన బీజేపీ బాగా లాభపడింది. కానీ దక్షిణాదిలో ఆ ఫార్ములాలేవీ పనిచేయవంటున్నారు కృష్ణ సాగర్ రావు. అదృష్టవశాత్తు దక్షిణాదిలో కేవలం కర్నాటకలోనే యడ్యూరప్ప లాంటి బలమైన నాయకుడు బీజేపీకి దొరికాడని, కానీ తెలంగాణలో అలాంటి నాయకత్వం లేకపోవడం పార్టీ విస్తరణకు ప్రధాన అడ్డంకిగా మారిందని అంటున్నారాయన. తనకు అవకాశమిస్తే తెలంగాణలో పార్టీ పునర్ నిర్మాణం చేపడతానని చెప్పారు. పరోక్షంగా బండి సంజయ్ నాయకత్వం వల్లే తెలంగాణలో పార్టీ బలపడటంలేదని చురకలంటించారు. బండి సంజయ్ సహా.. కేవలం విద్వేష రాజకీయాలను నమ్ముకునేవారిని పక్కనపెట్టాల్సిందేనంటూ పరోక్షంగా పార్టీకి హితబోధ చేశారు కృష్ణ సాగర్ రావు.

బీజేపీ దక్షిణాదిలో మత రాజకీయాలు చేయాలనుకోవడం భ్రమ అనే సంకేతాలు పంపారు కృష్ణసాగర్ రావు. ఇక్కడ గెలవాలంటే ఉత్తరాది వ్యూహాలను పూర్తిగా మార్చుకోవాల్సిందేనని అన్నారు. వాస్తవానికి కృష్ణ సాగర్ రావు తెలంగాణ బీజేపీకి చీఫ్ స్పోక్స్ పర్సన్ గా ఉన్నా కూడా ఇటీవల బండి సంజయ్ ఆయనను టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. అధికార ప్రతినిధులకు ర్యాంకులిచ్చే విషయంలో కృష్ణ సాగర్ రావుని కిందకు నెట్టేశారు సంజయ్. ఆయనను 16వ స్థానానికి పరిమితం చేశారు. పార్టీకి మంచి చెప్పే ఇలాంటి వారితో తన రాజకీయ భవిష్యత్తుకి ముప్పు ఉందని ముందే గ్రహించారు సంజయ్. అయితే కృష్ణ సాగర్ రావు వంటివారు మాత్రం పార్టీ విషయంలో నిక్కచ్చిగా ఉంటారు. పార్టీ నిలబడాలంటే దక్షిణాదిలో నాయకత్వ మార్పు, వ్యూహాల మార్పు అనివార్యం అని చెబుతున్నారు.

Tags:    
Advertisement

Similar News