డీజీపీ, ఆర్టీసీ ఎండీలకు కేటీఆర్ వార్నింగ్
ఆర్టీసీ లోగో కూడా మారిందంటూ సోషల్‌మీడియాలో ప్రచారం చేశారు. కొత్త లోగో ఇలా ఉండనుందని ప్రముఖ మీడియా సంస్థలు కూడా వార్తలు రాశాయి.
తెలంగాణ ఆర్టీసీకి సంబంధించి ఫేక్ లోగో ప్రచారం చేశారంటూ బీఆర్ఎస్ లీడర్లపై కేసు పెట్టడాన్ని తప్పుపట్టారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్‌కు అనుబంధంగా పనిచేస్తూ ఇదే లోగోను ప్రసారం చేసిన మీడియా ఛానల్స్ Ntv, బిగ్ టీవీ, వెలుగు పత్రికపై ఎందుకు కేసులు పెట్టడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వ పెద్దల సూచనలతో బీఆర్ఎస్ నేతలపై ఇలాగే వేధింపులు కొనసాగిస్తే కోర్టుకు లాగుతామని డీజీపీ రవి గుప్తా, టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌లకు వార్నింగ్ ఇచ్చారు కేటీఆర్.
ఇంతకీ ఏం జరిగిందంటే..?
ప్రభుత్వ ఆదేశాల మేరకు టీఎస్ ఆర్టీసీని TGS RTCగా మార్చుతూ అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కొంత మంది ఆర్టీసీ లోగో కూడా మారిందంటూ సోషల్‌మీడియాలో ప్రచారం చేశారు. కొత్త లోగో ఇలా ఉండనుందని ప్రముఖ మీడియా సంస్థలు కూడా వార్తలు రాశాయి. కానీ, అధికారులు బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొణతం దిలీప్, హరీష్ రెడ్డిలపై మాత్రమే కేసు నమోదు చేయడాన్ని కేటీఆర్ తప్పు పట్టారు. ఈ ఇద్దరిపై ఐపీసీ సెక్షన్ 469, 504, 505(1)(b)(c) కింద చిక్కడపల్లి పీఎస్‌లో కేసు నమోదైంది.
ఈ కేసులపై క్లారిటీ ఇవ్వాలంటూ నాయిని అనురాగ్ రెడ్డి అనే వ్యక్తి ట్విట్టర్‌లో సంధించిన మూడు ప్రశ్నలను రీట్వీట్ చేశారు కేటీఆర్. వీటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కొత్త లోగో ఇదే అంటూ మొదటగా ఈ నెల 22న కాంగ్రెస్‌కు అనుబంధంగా ఉన్న ట్విట్టర్ హ్యాండిల్స్ ట్వీట్ చేశాయని, తర్వాత కొన్ని మీడియా సంస్థలు కూడా ప్రసారం చేశాయన్నారు. కానీ, ఆర్టీసీ మాత్రం లోగో మార్పుపై క్లారిటీ ఇచ్చేందుకు 24 గంటల టైమ్ ఎందుకు తీసుకుందని ప్రశ్నించారు. ప్రభుత్వం కేసు పెట్టాలనుకుంటే ఆ ఫేక్ ప్రచారానికి సోర్స్ ఎవరనేదానిపై విచారణ చేయాలి కదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ కార్యకర్తలను ఎందుకు టార్గెట్ చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక ఈ అంశంపై కేసు నమోదు చేసిన విషయం మొదటగా సీఎం పీఆర్వో కుమారుడికి ఎలా తెలిసిందని, అందరికంటే ముందు ఆయన ఎలా ట్వీట్ చేశారని ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా అంటూ డీజీపీ, ఆర్టీసీ ఎండీలను ట్యాగ్ చేశారు కేటీఆర్.