ప్రజల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం -కేటీఆర్
బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య పరిమితికి మించకుండా ఎలాంటి భద్రతా నిబంధనలు పాటిస్తున్నారని సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు కేటీఆర్.
తెలంగాణలో మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు కానీ, బస్సుల సంఖ్య పెంచకపోవడంతో సాధారణ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే విషయాన్ని ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ప్రస్తావించారు. బస్సుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేశారాయన. తాజాగా జరిగిన ఓ బస్సు ప్రమాదం ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని మరోసారి కళ్లకు కట్టింది. ఈ ప్రమాదంపై కేటీఆర్ ట్విట్టర్లో ఆవేదన వ్యక్తం చేశారు. అమాయక ప్రజల జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుకుంటోందని అన్నారు.
జగిత్యాల జిల్లా మోరపెల్లి మండలంలో 170 మందితో కిక్కిరిసి వెళ్తున్న ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. 50మంది ఎక్కాల్సిన బస్సులో 170మంది ఎక్కడంతో ఓవర్ లోడ్ అయింది. అసలే బస్సుల మెయింటెనెన్స్ అంతంతమాత్రంగానే ఉంది. దీంతో మోరపెల్లి శివారు వద్ద బస్సు వెనుక టైర్లు ఊడిపోయాయి. కుడివైపు ఉన్న రెండు టైర్లు ఊడిపోయి బస్సు రోడ్డుపై ఆగిపోయింది. ఊడిన టైర్లు దూరంగా వెళ్లి పడ్డాయి. ఆ బస్సులోని ప్రయాణికులు అదృష్టవంతులు కాబట్టి ఎలాంటి గాయాలు లేకుండా ప్రమాదం నుంచి బయటపడ్డారని అన్నారు కేటీఆర్.
మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా ఆర్టీసీని మరింత సన్నద్ధ పరిచే విషయంలో విఫలమైంది. బస్సుల సంఖ్య పెంచలేదు సరికదా వాటి మెయింటెనెన్స్ విషయంలో కూడా నిర్లక్ష్యంగా ఉంది. దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య పరిమితికి మించకుండా ఎలాంటి భద్రతా నిబంధనలు పాటిస్తున్నారని సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు కేటీఆర్. ఓవర్‌లోడ్ కారణంగా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న డ్రైవర్‌లు, కండక్టర్‌లకు ఎలాంటి పరిహారం అందజేస్తున్నారని అడిగారు.