పగబట్టి ఇంటికొచ్చి కవితను అరెస్ట్ చేశారు -కేటీఆర్
సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డిని ఓడించి ప్రధాని మోదీకి స్పష్టమైన సందేశం పంపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పద్మారావు గౌడ్ గెలుపుతో బీఆర్‌ఎస్ జైత్రయాత్ర మళ్లీ ప్రారంభం కావాలని ఆకాంక్షించారు కేటీఆర్.
గతంలో సుప్రీంకోర్టులో స్టే ఉండటంతో కవితను బీజేపీ అరెస్ట్ చేయించలేకపోయిందని, ఎన్నికల తర్వాత పగబట్టి, ఇంటికొచ్చి మరీ కవితమ్మను అరెస్ట్ చేశారని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కవితతో పాటు ఇద్దరు ముఖ్యమంత్రుల్ని కూడా బీజేపీ అరెస్ట్ చేయించిందని చెప్పారు. అలాంటి బీజేపీకి బీఆర్ఎస్ బీటీమ్ అంటూ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రచారం చేసిందని, కాంగ్రెస్ నేతలు ఇప్పుడేమంటారని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని సూచించారు. హైదరాబాద్ లో ఎవరూ నమ్మలేదని, అందుకే బీఆర్ఎస్ కి ఇక్కడ మెజార్టీ స్థానాలు వచ్చాయని, కానీ మిగతా చోట్ల ఆ తప్పుడు ప్రచారం ఫలించిందని చెప్పారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో మాట్లాడిన కేటీఆర్.. బీజేపీ, కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు.
సికింద్రాబాద్ లో బీఆర్ఎస్ కి బీజేపీతోనే పోటీ అని చెప్పారు కేటీఆర్. కాంగ్రెస్ మనకు పోటీ కానే కాదని అన్నారు. కిషన్ రెడ్డి సికింద్రబాద్ ఎంపీగా ఉండి చేసిందేమీ లేదని, అంబర్ పేటలో పోటీ చేయకుండా భయపడి వెళ్ళిపోయారని ఎద్దేవా చేశారు. ఈ సారి కిషన్ రెడ్డికి సానుభూతి కూడా లేదని, ఆయన ఓడిపోవడం ఖాయమని చెప్పారు కేటీఆర్. కరోనా సమయంలో కుర్ కురేలు పంచిన కుర్ కురే రెడ్డి, కిషన్ రెడ్డి అని కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే కిషన్ రెడ్డి మాత్రం రైల్వే స్టేషన్‌లో లిఫ్టులు ప్రారంభించారని కేటీఆర్ సెటైర్లు పేల్చారు. సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డిని ఓడించి ప్రధాని మోదీకి స్పష్టమైన సందేశం పంపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పద్మారావు గౌడ్ గెలుపుతో బీఆర్‌ఎస్ జైత్రయాత్ర మళ్లీ ప్రారంభం కావాలని ఆకాంక్షించారు కేటీఆర్.
హైదరాబాద్ పరిధిలో గత మూడు నెలలుగా భవన నిర్మాణ అనుమతులు ఎందుకు ఆపారని ప్రశ్నించారు కేటీఆర్. హైదరాబాద్ లో 8 లక్షల కుటుంబాలపై మంచినీటి బిల్లుల భారం మోపారని చెప్పారు. బీఆర్‌ఎస్ తరపున పోరాటం చేపడతామని చెప్పారు. కేంద్రంలో బీజేపీని నిలువరించాలంటే.. కాంగ్రెస్ తో సాధ్యం కాదని, ఆ పార్టీకి ఈసారి 40 లోక్ సభ స్థానాలు కూడా రావని జోస్యం చెప్పారు కేటీఆర్. మోదీని ఆపాలంటే కేసీఆర్, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ లాంటి ప్రాంతీయ పార్టీల నేతలతోనే సాధ్యమని అన్నారు.