వండిన అన్నం వ‌డ్డించే తెలివి కూడా కాంగ్రెస్ కి లేదు

రేవంత్ మొగోడైతే రూ. 2 ల‌క్ష‌ల రుణ‌మాఫీ చేయాలన్నారు. వరికి రూ.500 బోన‌స్ ఇవ్వాలని, ఆస‌రా పెన్ష‌న్ రూ.4 వేలు ఇవ్వాలని, ఆడ‌బిడ్డ‌ల‌కు నెలకు రూ. 2,500 ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

Advertisement
Update:2024-04-06 18:25 IST

నాగార్జున సాగ‌ర్‌లో నీళ్లున్నా కూడా పంట‌ల‌కు నీళ్లు ఇవ్వ‌డంలేదని, మిష‌న్ భ‌గీర‌థ అప్ప‌గించినా నీళ్లిచ్చేందుకు కాంగ్రెస్ కి చేతులు రావడంలేదని, వండిన అన్నం వ‌డ్డించే తెలివి కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి లేదని ధ్వ‌జ‌మెత్తారు కేటీఆర్. తెలంగాణ‌లో వ్య‌వ‌సాయ సంక్షోభం నెల‌కొంద‌ని, కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన 4 నెల‌ల్లోనే రైతుల‌కు ఇలాంటి దుస్థితి రావడానికి కారణం వారి అసమర్థ పాలనేనని మండిపడ్డారు. రాజ‌న్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వ‌హించిన రైతుదీక్ష‌లో పాల్గొన్న కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై, సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు.


కాంగ్రెస్ హామీలు న‌మ్మి మోసపోయిన ప్ర‌జ‌లు.. పాలిచ్చే బ‌ర్రెను పంపించి దున్న‌పోతును తెచ్చుకున్నామ‌ని ఆవేద‌న చెందుతున్నారని చెప్పారు కేటీఆర్. రైతుబంధు ఏదని, పథకాలు ఏవని ప్రజలు అడుగుతుంటే.. ఎల‌క్ష‌న్ కోడ్ వ‌చ్చింద‌ని సీఎం, మంత్రులు చావుక‌బురు చల్లగా చెబుతున్నారన్నారు. అసలు పాల‌న త‌న చేతుల్లో లేద‌ని సీఎం రేవంత్ అన‌డం సిగ్గు చేటన్నారు. రేవంత్‌ రెడ్డికి చిత్త‌శుద్ధి ఉంటే రైతుల ముందుకు రావాలని, పంట‌ల‌కు బోన‌స్ ఇస్తామ‌ని ఈసీకి లేఖ రాయాలని సవాల్ విసిరారు. అలా చేస్తే తాము కూడా మ‌ద్ద‌తిస్తామని భరోసా ఇచ్చారు. ఎర్ర‌టి ఎండ‌ల్లో కేసీఆర్ రైతుల ద‌గ్గ‌రికి వెళ్లి భ‌రోసా ఇచ్చారని, నేడు కేసీఆర్ బాట‌లో బీఆర్ఎస్ శ్రేణులు దీక్ష‌లు చేస్తున్నాయని చెప్పారు కేటీఆర్.

ఎన్నిక‌ల ముందు రైతుబంధు కోసం రూ.7 వేల కోట్లు తాము సిద్ధంగా పెట్టామని, అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈసీకి లేఖలు రాసి మరీ కాంగ్రెస్.. రైతు బంధు పంపిణీని అడ్డుకుందని.. ఆ డ‌బ్బులు ఏమ‌య్యాయో చెప్పాలని నిలదీశారు రేవంత్ రెడ్డి. మోసపూరిత హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చిందని, డిసెంబ‌ర్ 9న రూ. 2 ల‌క్ష‌ల రుణ‌మాఫీ చేస్తామ‌ని మోసం చేశారని, రైతుబంధు రూ. 15 వేలు ఇస్తామ‌ని మోసం చేశారని, వ‌రికి క్వింటాల్‌కు రూ. 500 బోన‌స్ ఇస్తామ‌ని చెప్పి మోసం చేశారని చెప్పారు కేటీఆర్.

ప్ర‌తి కొనుగోలు కేంద్రానికి వెళ్లి రూ. 500 బోన‌స్‌పై నిల‌దీద్దామని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు కేటీఆర్. ఎల‌క్ష‌న్ కోడ్ ఉందని సాకు చెబితే, కోడ్ ముగిసిన తర్వాతయినా ఇస్తామ‌ని రేవంత్ మాటివ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించాలని చెప్పారు. రేవంత్ మొగోడైతే రూ. 2 ల‌క్ష‌ల రుణ‌మాఫీ చేయాలన్నారు. వరికి రూ.500 బోన‌స్ ఇవ్వాలని, ఆస‌రా పెన్ష‌న్ రూ.4 వేలు ఇవ్వాలని, ఆడ‌బిడ్డ‌ల‌కు నెలకు రూ. 2,500 ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

Tags:    
Advertisement

Similar News