రుణమాఫీపై రేవంత్ సర్కార్ కొత్త డ్రామా - కేటీఆర్
మొన్న ఖమ్మంలో ముసలవ్వ పింఛన్ వాపస్, ఇప్పుడు రైతు రుణమాఫీలో వాపస్ ఆప్షన్ తీసుకువచ్చిందంటూ విమర్శలు గుప్పించారు.
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రుణమాఫీ ప్రక్రియపై ఇంకా గందరగోళం కొనసాగుతోంది. రుణమాఫీ కానీ వారి కోసం గ్రామాల్లో సర్వే మొదలు పెట్టిన ప్రభుత్వం.. మాఫీ వర్తించని రైతుల నుంచి అఫిడవిట్‌లు స్వీకరిస్తోంది. రైతులు ఇచ్చిన వివరాలు తప్పని తేలితే తిరిగి మాఫీ అయిన రుణం మొత్తం ప్రభుత్వానికి తిరిగి చెల్లించేలా ఒప్పందం రాయించుకుంటోంది. ఐతే ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
రుణమాఫీ కాని రైతులను రేవంత్ సర్కార్ అవమానిస్తోందన్నారు కేటీఆర్. సెల్ఫ్ డిక్లరేషన్ పేరుతో కొత్త డ్రామాకు తెరలేపిందని, ఇచ్చేది పక్కనపెట్టి వాపస్‌పై దృష్టి పెట్టిందంటూ మండిపడ్డారు కేటీఆర్. మొన్న ఖమ్మంలో ముసలవ్వ పింఛన్ వాపస్, ఇప్పుడు రైతు రుణమాఫీలో వాపస్ ఆప్షన్ తీసుకువచ్చిందంటూ విమర్శలు గుప్పించారు. కేసీఆర్ రైతును రాజును చేస్తే, రేవంత్ సర్కార్ రైతులను అవమానిస్తోందంటూ ఫైర్ అయ్యారు.
రుణమాఫీపై మంత్రులు, ముఖ్యమంత్రి జూటా మాటలు, అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు కేటీఆర్. ఒక్క రుణమాఫీకి వంద కొర్రీలు పెట్టారన్న కేటీఆర్...సెల్ఫీ దిగి రైతు తాను రైతు అని నిరూపించుకోవాలా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుగా రుణమాఫీ చేయలేక రేవంత్ సర్కార్ నయా డ్రామా షురూ చేసిందన్నారు. వద్దురా నాయన కాంగ్రెస్ పాలన అనే రీతిలో ప్రభుత్వం తయారైందన్నారు.