ఇండియాకు టెస్లా.. రేవంత్‌కు కేటీఆర్ విజ్ఞప్తి
ఈ నెలాఖరులోగా ప్లాంట్ ఏర్పాటుకు అనువైన స్థలంపై అధ్యయనం చేసేందుకు టెస్లా బృందం ఇండియాకు వస్తుందని పారిశ్రామిక వర్గాలు తెలిపాయి.
ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా ఇండియాలో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దాదాపు 2 నుంచి 3 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఇండియాలో ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు టెస్లా ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు పారిశ్రామిక వర్గాలు తెలిపాయి. అయితే ప్లాంటు ఏర్పాటుకు సరైన స్థలం కోసం టెస్లా అన్వేషిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ఓ ప్రత్యేక బృందాన్ని టెస్లా ఈ నెలలోనే ఇండియాకు పంపనున్నట్లు తెలుస్తోంది.
ఇండియాలో వాహనాల తయారీని పెంచే దిశగా కేంద్రం ఇటీవల కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా రాబోయే మూడేళ్ల వ్యవధిలో ఇండియాలో వాహనాలను తయారు చేయడానికి సిద్ధపడే కంపెనీలకు చెందిన ఎలక్ట్రానిక్ వెహికిల్స్ దిగుమతిపై సుంకం తగ్గిస్తామని హామీ ఇచ్చింది. ఈ నిర్ణయంతో టెస్లా ఇండియాలో ప్లాంట్ పెట్టాలని నిర్ణయించింది.
ఈ నెలాఖరులోగా ప్లాంట్ ఏర్పాటుకు అనువైన స్థలంపై అధ్యయనం చేసేందుకు టెస్లా బృందం ఇండియాకు వస్తుందని పారిశ్రామిక వర్గాలు తెలిపాయి. ప్రస్తుతమున్న సమాచారం ప్రకారం ఇప్పటికే ఆటోమోటివ్ హబ్‌లను కలిగి ఉన్న మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాలను ప్లాంట్ ఏర్పాటు కోసం పరిశీలిస్తున్నట్లు ఫైనాన్షియల్ టైమ్స్ పత్రిక రాసుకొచ్చింది. హర్యానా, దాని పొరుగున ఉన్న ఢిల్లీలోనూ పలు కార్ల కంపెనీలు ప్లాంట్లను కలిగి ఉన్నప్పటికీ.. పోర్టు సౌకర్యం లేకపోవడంతో ఎలాన్ మస్క్ తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్‌లను ప్లాంట్ ఏర్పాటుకు అనువైన ప్రాంతాలుగా భావిస్తున్నట్లు సమాచారం.
ఇక ఈ వార్తపై స్పందించారు పరిశ్రమల శాఖ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. టెస్లాను తెలంగాణకు తీసుకురావడానికి అన్ని విధాలా కృషి చేయాలని రేవంత్ సర్కార్‌కు విజ్ఞప్తి చేశారు. టెస్లా బృందాన్ని హైదరాబాద్‌కు స్వాగతించి తెలంగాణ ప్రభుత్వ ప్రగతిశీల పారిశ్రామిక విధానాలు వివరించాలని కోరారు. గతంలో ఓ సారి తెలంగాణలో ప్లాంటు పెట్టాలని ఎలాన్ మస్క్‌ను కోరారు కేటీఆర్.