దయాకర్ ని సస్పెండ్ చేయాల్సిందే.. సారీపై వెంకట్ రెడ్డి రియాక్షన్..

కాంగ్రెస్ పార్టీ నుంచి తనకు అవమానం జరిగిందని గుర్రుగా ఉన్నకోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డి సారీతో చల్లబడలేదు.

Advertisement
Update:2022-08-13 13:16 IST

కాంగ్రెస్ పార్టీ నుంచి తనకు అవమానం జరిగిందని గుర్రుగా ఉన్నకోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డి సారీతో చల్లబడలేదు. రేవంత్ రెడ్డి ట్విట్టర్లో పోస్ట్ చేసిన వీడియోని తాను చూడలేదని, ఆయన సారీని వినలేదని చెప్పారు వెంకట్ రెడ్డి. తనపై వాడకూడని పదాన్ని వాడినందుకు దయాకర్ రెడ్డిని కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేయాల్సిందేనన్నారు. మునుగోడు నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగే పాదయాత్రలో తాను పాల్గొనబోనని స్పష్టం చేశారు వెంకట్ రెడ్డి.

సస్పెండ్ చేయాల్సిందే..?

చుండూరు సభ కాంగ్రెస్ లో పెట్టిన చిచ్చు ఇప్పుడల్లా చల్లారేలా లేదు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా సందర్భంగా రేవంత్ రెడ్డి సహా మరికొందరు చేసిన విమర్శలతో వెంకట్ రెడ్డి తీవ్రంగా నొచ్చుకున్నారు. అన్నదమ్ములిద్దర్నీ రేవంత్ రెడ్డి విమర్శించారని, తాను చేసిన తప్పేంటని ప్రశ్నిస్తున్నారు వెంకట్ రెడ్డి. రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పినా కుదరదంటున్నారు. తనకు కావాల్సింది అద్దంకి దయాకర్ సస్పెన్షన్ అని తేల్చి చెబుతున్నారు వెంకట్ రెడ్డి. దయాకర్ ని సస్పెండ్ చేయాలని తాను పీసీసీ అధ్యక్షుడిని కోరానని అంటున్నారు.

అధిష్టానం చొరవ తీసుకున్నా..

మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్కం ఠాగూర్ కూడా ఈ వ్యవహారంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని బుజ్జగిస్తున్నట్టు తెలుస్తోంది. అటు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్వయంగా క్షమాపణ చెప్పినా ఆయన బెట్టుదిగలేదు. పార్టీలోనుంచి వెళ్లిపోతే వెంకట్ రెడ్డిని విమర్శించినా ప్రజలు, కార్యకర్తలు హర్షిస్తారు, ఆయన వెళ్లిపోకముందే విమర్శలు చేయడం మాత్రం కలకలంగా మారింది. దీనివల్ల పార్టీకే నష్టమని అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే రేవంత్ రెడ్డి కూడా మెట్టుదిగి సారీ చెప్పారు. గతంలోనే అద్దంకి దయాకర్ ఓసారి సారీ చెప్పారు. ఇప్పుడు ఆయన రెండోసారి కూడా క్షమాపణ ప్రకటన విడుదల చేశారు, బహిరంగంగా సారీ చెప్పారు. ఈసారీలతో తనకు పనిలేదంటున్న వెంకట్ రెడ్డి.. దయాకర్ పై వేటు వేసే వరకు తగ్గేదే లేదంటున్నారు.

Tags:    
Advertisement

Similar News