'కేసీఆర్' పేరుతో సినిమా.. పాట విడుదల చేసిన 'కేసీఆర్'
చిత్ర యూనిట్ ని కేసీఆర్ అభినందించారు. తన పేరుతో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు.
కేశవ చంద్ర రమావత్. షార్ట్ కట్ లో KCR. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో తెరకెక్కిన ఈ సినిమాలో 'తెలంగాణ తేజం' అనే పాటను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ సినిమా ప్రమోషన్ ప్రారంభించబోతున్నారు. ముందస్తుగా సినిమాలోని లిరికల్ వీడియోని కేసీఆర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు.
KCR పేరుతో తెరకెక్కిన ఈ సినిమాలో జబర్దస్త్ ఫేమ్ రాకింగ్ రాకేశ్ హీరో. ఆయనే నిర్మాత కూడా. తెలంగాణ తేజం అంటూ సాగే ఈ సినిమాలో పాటకు సంజయ్ మహేష్ సాహిత్యాన్ని అందించారు. గాయని విహ ఈ పాటను ఆలపించగా చరణ్ అర్జున్ సంగీతాన్నందించారు. సినిమా టెక్నీషియన్లతో పాటు రాకింగ్ రాకేష్ దంపతులు నంది నగర్ లోని కేసీఆర్ నివాసానికి వెళ్లి అక్కడ గీత ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సినిమా కాన్సెప్ట్ ని కేసీఆర్ కి వివరించారు నిర్మాత రాకింగ్ రాకేష్. వీడియో లిరికల్ సాంగ్ ని ఆయనకు చూపించారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ని కేసీఆర్ అభినందించారు. తన పేరుతో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. 'తెలంగాణ తేజం' పాట బాగుందని అన్నారు కేసీఆర్.