కేసీఆర్ రీఎంట్రీకి భారీ ఏర్పాట్లు.. తొలి బహిరంగ సభ ఎక్కడంటే..?

బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల్లో నూతనోత్సాహం, ఆత్మస్థైర్యం నింపేలా ఇప్పటికే పలు కార్యక్రమాలు జరుగుతున్నాయి. లోక్ సభ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలతో కేటీఆర్, పార్టీ కేడర్ ని ఉత్సాహపరుస్తున్నారు. కేసీఆర్ ఎంట్రీతో ఈ కార్యక్రమాలు మరింత ఊపందుకుంటాయి.

Advertisement
Update:2024-01-14 06:44 IST

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పూర్తి స్థాయిలో ఇఁకా జనం మధ్యకు రాలేదు. తుంటి ఎముక ఆపరేషన్ అనంతరం కోలుకుంటున్న ఆయన త్వరలో గ్రాండ్ రీఎంట్రీ ఇస్తారని చెబుతున్నాయి పార్టీ శ్రేణులు. ఫిబ్రవరి-17న ఆయన పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ భవన్ కు వస్తారని, అప్పటినుంచి ఆయన ప్రజలకు అందుబాటులో ఉంటారని అంటున్నారు. తెలంగాణ భవన్‌ లో ఆయనకు స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు మొదలయ్యాయి.

అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ఫలితాలతో బీఆర్ఎస్ కాస్త డీలా పడ్డా, లోక్ సభ ఎన్నికల్లో సత్తా చూపించాలని పార్టీ శ్రేణులు కసితో ఉన్నాయి. నాయకులు, కార్యకర్తల్లో నూతనోత్సాహం, ఆత్మస్థైర్యం నింపేలా ఇప్పటికే పలు కార్యక్రమాలు జరుగుతున్నాయి. లోక్ సభ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలతో కేటీఆర్ పార్టీ కేడర్ ని ఉత్సాహపరుస్తున్నారు. కేసీఆర్ ఎంట్రీతో ఈ కార్యక్రమాలు మరింత ఊపందుకుంటాయి. వచ్చేనెల 17నుంచి పార్టీ కార్యకలాపాలలో కేసీఆర్ క్రియాశీలం అవుతారని తెలుస్తోంది.

కేసీఆర్ పుట్టినరోజుతో మొదలు..

కేసీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా క్షేత్ర స్థాయిలో భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహించేందుకు బీఆర్‌ఎస్‌ సన్నాహాలు చేస్తోంది. హైదరాబాద్ నగరంతోపాటు.. తెలంగాణ వ్యాప్తంగా హోర్డింగులు, ఫ్లెక్సీలతో హోరెత్తించబోతున్నారు. ఆరోజు నందినగర్‌ నివాసం నుంచి తెలంగాణ భవన్‌ వరకు భారీ కాన్వాయ్‌తో కేసీఆర్‌ ర్యాలీగా కదలి వస్తారు. కేసీఆర్‌ను వ్యక్తిగతంగా కలిసేందుకు పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు కీలక నేతలు కూడా హైదరాబాద్ కి తరలి వస్తారు. తెలంగాణ భవన్‌ వేదికగా పార్టీ నేతలు, కేడర్‌ను కేసీఆర్ కలుస్తారు.

గజ్వేల్ పర్యటన, వరంగల్ సభ..

ఫిబ్రవరి-20 తర్వాత కేసీఆర్ తన సొంత నియోజకవర్గం గజ్వేల్ లో కూడా పర్యటిస్తారని సమాచారం. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో కూడా ఆయన ప్రజలకు అందుబాటులో ఉంటారని పార్టీ నేతలు చెబుతున్నారు. గజ్వేల్‌లో కూడా ఆయనకు భారీగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేయబోతున్నారు. నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞత తెలపడంతోపాటు, స్థానికంగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై కూడా ఆయన అధికారులతో చర్చిస్తారని తెలుస్తోంది. ఇక లోక్ సభ ఎన్నికల సమర శంఖారావం వరంగల్ నుంచి పూరించే ఏర్పాట్లు చేస్తున్నారట. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వరంగల్ లో పెట్టాల్సిన సభలు వాయిదా పడటంతో.. ఆ లోటుని ఇప్పుడు భర్తీ చేయాలనుకుంటున్నారు. లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే లోపు వరంగల్ లో భారీ బహిరంగ సభతో బీఆర్ఎస్ సత్తా చూపిస్తారని తెలుస్తోంది. అదే ఊపులో ప్రచార కార్యక్రమాలు కూడా ముమ్మరం చేస్తారు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పట్టు నిలుపుకుంటే.. కచ్చితంగా అది కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రభావం చూపెడుతుందనే వాదన కూడా ఉంది. కాంగ్రెస్ పాలనను మరింత సాధికారికంగా విమర్శించేందుకు అవకాశం దొరుకుతుంది. అందుకే లోక్ సభ ఎన్నికలను బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 

Tags:    
Advertisement

Similar News