ఆ ఖాతాలు లేని ఏకైక సీఎం కేసీఆర్
తెలంగాణ ఉద్యమ సమయంలోనూ, ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యాక కూడా సోషల్ మీడియాను బాగానే ఉపయోగించుకున్నారు కేసీఆర్. ప్రెస్‌మీట్‌లలో సోషల్ మీడియాలో వచ్చిన అంశాలను ప్రస్తావించిన సందర్భాలు కూడా ఉన్నాయి.
లోకల్ నుంచి నేషనల్‌కి ఎదిగిన నేత.. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్. టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసి.. తనదైన ప్రత్యేక శైలితో తెలంగాణ రాష్ట్రం సాధన కోసం ఏళ్ల తరబడి పోరాటం చేసిన కేసీఆర్.. ఇప్పుడు దేశ రాజకీయాల్లోనూ చక్రం తిప్పేందుకు రెడీ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు అనంతరం ఆ ప్రయత్నాల్లో బిజీబిజీగా ఉన్నారు.
సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉండే అంశాలపై ఎప్పుడూ అప్‌డేట్‌గా ఉండే గులాబీ బాస్.. తనకు మాత్రం అందులో వ్యక్తిగత ఖాతా ఏర్పాటు చేసుకోకపోవడం ఆశ్చర్యకరం. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్.. వేటిలోనూ ఆయనకు అఫీషియల్‌గా వ్యక్తిగత ఖాతా లేదు.
ఇప్పుడు ప్రపంచంలో సోషల్ మీడియా పాత్ర తెలియనిది కాదు. సోషల్ మీడియాను బేస్ చేసుకుని పాపులర్ అయినవారు ఎందరో ఉన్నారు. మన జీవితంలో ఒక భాగంగా మారిన ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో వ్యక్తిగత ఖాతాలు మన దేశంలోని ముఖ్యమంత్రులందరికీ ఉన్నాయి. కానీ, ఫేసుబుక్ మినహా వేటిలోనూ ఖాతాయే లేని సీఎం ఒక్క కేసీఆర్ మాత్రమే. ప్రభుత్వం నిర్వహించే సీఎంవో తెలంగాణ.. అనే ఖాతా తప్ప ఆయనకంటూ వ్యక్తిగత ఖాతా లేదు. దీనిని కూడా అధికారులు మొక్కుబడిగా పెట్టినదే కావడం గమనార్హం.
తెలంగాణ ఉద్యమ సమయంలోనూ, ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యాక కూడా సోషల్ మీడియాను బాగానే ఉపయోగించుకున్నారు కేసీఆర్. ప్రెస్‌మీట్‌లలో సోషల్ మీడియాలో వచ్చిన అంశాలను ప్రస్తావించిన సందర్భాలు కూడా ఉన్నాయి.
టీఆర్ఎస్ పార్టీ కీలక నేతలు కేటీఆర్, హరీష్‌రావు, కవిత.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. కేటీఆర్ అయితే తనను ట్యాగ్ చేస్తూ వచ్చిన ప్రతీ అంశంపై స్పందిస్తూనే ఉంటారు. సోషల్ మీడియా వేదికగా తన దృష్టికి వచ్చే సమస్యలపై తక్షణం స్పందిస్తుంటారు.
మొదటి నుంచీ కేసీఆర్ సోషల్ మీడియాలో వ్యక్తిగత ఖాతాకు దూరంగానే ఉన్నారు. సంచలన రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే కేసీఆర్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల నుంచి దేశ రాజకీయాలకు ఎగబాకారు. మరి సోషల్ మీడియాలో తన వ్యక్తిగత ఖాతా ఇకనైనా తెరుస్తారా? లేదా ట్రెండ్ ఫాలో అవడం కాదు.. నేనే ట్రెండ్ సెట్ చేస్తా అంటూ.. ఏదైనా వేరే ప్లాన్‌తో ఉన్నారా అనేది తెలియాల్సి ఉంది.