కేసీఆర్‌ ను మళ్లీ ముఖ్యమంత్రి చేయడమే ఆయనకిచ్చే గిఫ్ట్‌

కేసీఆర్‌ జన్మదిన వేడుకల్లో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

Advertisement
Update:2025-02-17 14:59 IST

కేసీఆర్‌ ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయడమే ఆయనకు మనమిచ్చే పెద్ద గిఫ్ట్‌ అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. సోమవారం తెలంగాణ భవన్‌ లో కేసీఆర్‌ 71వ జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రులు హరీశ్‌ రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, శాసన మండలిలో ప్రతిపక్షనేత మధుసూదనాచారి, ఇతర నాయకులతో కలిసి కేసీఆర్‌ బర్త్‌ డే కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ఏ మూలకు పోయినా మళ్లీ కేసీఆర్‌ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని.. కేసీఆర్‌ ను మళ్లీ ముఖ్యమంత్రి చేయాలన్న లక్ష్యంతో 60 లక్షల గులాబీ దండు పని చేయాలని పిలుపునిచ్చారు. కేసీఆర్‌ కారణ జన్ముడని.. సమైక్య పాలన దోపిడీ నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పించారని అన్నారు. ఆయన కొడుకుగా పుట్టడం తన పూర్వజన్మ సుకృతమన్నారు. కోట్లాది మంది తెలంగాణ ప్రజల తరపున కొట్లాడి చావునోట్లో తలపెట్టి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారని.. 25 ఏళ్ల పాటు తెలుగు రాజకీయాలను ఆయన శాసించారని అన్నారు. తెలంగాణ అనే పసిగుడ్డును తిరిగి తండ్రి చేతుల్లో పెట్టడమే కేసీఆర్‌ కు మనమిచ్చే అతిపెద్ద బహుమానం అన్నారు.

కేసీఆర్‌ అంటే వ్యక్తి కాదు.. ఒక భావోద్వేగం : హరీశ్‌ రావు

కేసీఆర్‌ అంటే ఒక వ్యక్తికాదని.. ఒక భావోద్వేగమని మాజీ మంత్రి హరీశ్‌ రావు అన్నారు. కేసీఆర్‌ తన 16 ఏళ్ల వయసులోనే 1969 తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని.. వందలు, వేల గంటల మేధోమదనం తర్వాత తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టారని అన్నారు. పదవుల కోసమే తెలంగాణ ఉద్యమం చేస్తారన్న అపవాదు తొలగించుకోవడానికే డిప్యూటీ స్పీకర్‌, పార్టీ కార్యదర్శి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలోకి వచ్చారని గుర్తు చేశారు. కేసీఆర్‌ పై తనకు సంపూర్ణ విశ్వాసం ఉందని ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ చెప్పేవారని తెలిపారు. ఉద్యమ సమయంలో వ్యక్తిత్వ హననం చేసేవారని.. రకరకాలుగా బాధ పెట్టేవారని అన్నారు. కేసీఆర్‌ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారని తెలిపారు. ఆ దీక్షతోనే కేంద్రం దిగివచ్చి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేసిందన్నారు. సాధించుకున్న తెలంగాణను పదేండ్లు కన్నబిడ్డలాగా కేసీఆర్‌ తీర్చిదిద్దారని అన్నారు. తాగునీరు, సాగునీరు, విద్యుత్‌ సహా పలు రంగాల్లో దేశానికే రోల్‌ మోడల్‌గా తెలంగాణను నిలబెట్టారన్నారు. కేసీఆర్‌ కు తెలంగాణతో ఉన్నది పేగుబంధం అన్నారు.

రేవంత్‌ రెడ్డి ఆడుతున్నది ట్వంటీ 20 మ్యాచ్‌లు కాదని.. తొండి మ్యాచ్‌లని అన్నారు. ఆయన ఆడేది పైసల కోసమేనని ఎద్దేవా చేశారు. ఆయన మాటల్లో తొండి.. హామీల అమలులో తొండి.. కానీ కలెక్షన్లలో మాత్రం ట్వంటీ 20నే ఆడుడుతున్నారని కితాబిచ్చారు. దీపం ఉండగానే రేవంత్‌ ఇల్లు చక్కబెట్టుకుంటున్నారని అన్నారు. కేసీఆర్‌ మాత్రం టెస్ట్‌, వన్‌డే, టీ20ల్లో ఏదైనా అద్భుతంగా ఆడగలడని అన్నారు. ఎప్పుడు ఏ ఆట ఆడాలో కేసీఆర్‌ కు బాగా తెలుసు అన్నారు. రాష్ట్రంలో కూలీ పని చేసుకునే వాళ్ల నుంచి బడికిపోయే పిల్లల వరకు ప్రతి ఒక్కరూ మళ్లీ కేసీఆరే రావాలని అంటున్నారని తెలిపారు. ఓటమి విజయానికి నాంది అని.. మొన్న ఓటమి మరో మూడుసార్లు గెలుపునకు నాంది పలుకబోతుందన్నారు. తెలంగాణ ఎవరో ఇస్తే రాలేదని.. ఢిల్లీని కదిలించి తెలంగాణ తెచ్చింది కేసీఆర్‌ మాత్రమేనన్నారు.

Tags:    
Advertisement

Similar News