కవిత బెయిల్ పిటిషన్ పై వాదనలు.. ఈడీ, సీబీఐకి సుప్రీం నోటీసులు

కవిత బెయిల్ పిటిషన్‌పై ఈడీ, సీబీఐకి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్ట్‌ 20కి వాయిదా వేసింది.

Advertisement
Update:2024-08-12 14:34 IST

ఢిల్లీ లిక్కర్ కేసులో ఇటీవల మనీష్ సిసోదియాకు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఏ నిందితుడిని కాలపరిమితి లేకుండా జైలులో ఉంచలేరని సుప్రీం పేర్కొంది. కేసు విచారణలో పురోగతి లేకపోతే, కాల పరిమితి దాటిన తర్వాత కూడా ఆ నిందితుడిని జైలులో బంధించడం సరికాదని తెలిపింది. అది ఆ వ్యక్తి హక్కులను హరించడమే అవుతుందని స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఈరోజు ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై కూడా సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. పిటిషన్ ని ధర్మాసనం తిరస్కరించినా సీబీఐ, ఈడీకి నోటీసులు జారీ చేయడం కీలక పరిణామం.

గత శుక్రవారం సుప్రీం కోర్టులో కవిత మధ్యంతర బెయిల్‌ పిటిషన్ దాఖలు చేసిన విషయ తెలిసిందే. ఈ పిటిషన్‌ పై ఇవాళ విచారణ జరిగింది. కవిత తరపున లాయర్ ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. 5 నెలలుగా ఆమె జైలులోనే ఉన్నారని, ఇప్పటికే చార్జిషీట్లు దాఖలయ్యాయని, ఈ కేసులో మనీష్ సిసోదియాకు బెయిల్ ఇచ్చారని ఆయన కోర్టుకి తెలిపారు. కవిత ఒక మహిళ అని, మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు. ఈ బెయిల్ పిటిషన్ ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇది బీఆర్ఎస్ శ్రేణులకు నిరాశ కలిగించే వార్తే అయినా ఈడీ, సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు ఇవ్వడం ఆసక్తికర అంశం.

కవిత బెయిల్ పిటిషన్‌పై ఈడీ, సీబీఐకి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. కవిత బెయిల్ పిటిషన్లపై దర్యాప్తు సంస్థలు సమాధానం చెప్పాలని ఆ నోటీసుల్లో సుప్రీం పేర్కొంది. తదుపరి విచారణను ఆగస్ట్‌ 20కి వాయిదా వేసింది. 

Tags:    
Advertisement

Similar News