పుట్టినరోజు సందర్భంగా పాస్‌పోర్ట్‌లు పంచిపెడతా - కేఏపాల్
ఈనెల 25న తన 59వ పుట్టినరోజు సందర్భంగా మునుగోడు నియెజకవర్గంలో 59 మందికి డ్రా నిర్వహించి పాస్‌పోర్ట్‌లు ఇప్పిస్తానని చెప్పారు కేఏపాల్. విదేశాల్లో ఉద్యోగాల కోసం వీసాలు తెప్పిస్తానని కూడా హామీ ఇచ్చారు.
కేఏపాల్ మళ్లీ తెరపైకి వచ్చారు. ఆ మధ్య రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యటనలంటూ హడావిడి చేసిన ఆయన, సడన్‌గా కొన్ని రోజులు మాయమయ్యారు. ఆయన పార్టీ గుర్తింపు రద్దయినట్టు తాజాగా వార్తలు రావడంతో పాల్ మళ్లీ తెరపైకి వచ్చారు. ప్రజాశాంతి పార్టీ గుర్తింపును ఎన్నికల కమిషన్ రద్దు చేసిందంటూ వస్తున్న వార్తల్ని పాల్ ఖండించారు. తన పార్టీ గుర్తింపు రద్దు కాలేదని, కేవలం నోటీసులు మాత్రమే ఇచ్చారని చెప్పారు. ఆ నోటీసులకు తాను సమాధానం పంపిస్తానన్నారు. తన పార్టీ గుర్తింపు రద్దు చేయడం ఎవరి వల్లా కాదని, వచ్చే దఫా తెలంగాణలో ప్రజాశాంతి పార్టీ కచ్చితంగా అధికారంలోకి వచ్చి తీరుతుందన్నారు.
పాస్‌పోర్ట్‌లు పంచి పెడతా..
ఈనెల 25న తన 59వ పుట్టినరోజు సందర్భంగా మునుగోడు నియెజకవర్గంలో 59 మందికి డ్రా నిర్వహించి పాస్‌పోర్ట్‌లు ఇప్పిస్తానని చెప్పారు కేఏపాల్. విదేశాల్లో ఉద్యోగాల కోసం వీసాలు తెప్పిస్తానని కూడా హామీ ఇచ్చారు. ఏడు వేల మందికి సైతం ఉద్యోగాలు కల్పిస్తానన్నారు. పాస్‌పోర్ట్‌లు అంటే పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలా అంటూ అప్పుడే కేఏపాల్ స్టేట్‌మెంట్‌లపై సోషల్ మీడియాలో కామెంట్లు పడటం విశేషం.
గద్దర్‌కి భారత రత్న..
సడన్‌గా కేఏపాల్ గద్దర్ పేరు తెరపైకి తేవడం విశేషం. ప్రజా గాయకుడు గద్దర్‌కి భారత రత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు పాల్. వేలపాటలు పాడిన గద్దర్ శాంతి స్థాపన కోసం పాటుపడ్డారని, ఆయనకు భారత రత్న ఇవ్వాల్సిందేనన్నారు. అక్టోబర్ 2వ తేదీన శాంతి సదస్సు నిర్వహిస్తున్నామని చెప్పారు. సీఎం కేసీఆర్ ఒక్క లేఖ ఇస్తే.. తాను తెలంగాణ రాష్ట్రానికి లక్ష కోట్ల రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చారు కేఏపాల్. కేసీఆర్ హయాంలో కేవలం దేవాలయాలకు మాత్రమే నిధులిస్తున్నారని, తాను సీఎం అయ్యాక అన్ని మతాలను సమానంగా చూస్తానని, దేవాలయాలు, చర్చిలు, మసీదులకు నిధులిస్తానని చెప్పారు. క్రైస్తవుల్లో ఐకమత్యం కొరవడిందని, ఇంటికో పార్టీ పెట్టుకొని ఇతర పార్టీ నాయకుల దగ్గర దేహీ అంటూ వెళ్తున్నారని మండిపడ్డారు పాల్.