మళ్లీ ఐటీ రైడ్స్.. ఈసారి టార్గెట్ ఎవరంటే.?
మనోహర్ రెడ్డి సోదరుడు శ్రీనివాస్ రెడ్డికి రంగారెడ్డి జిల్లా తాండూర్ ప్రాంతంలో RBL ఫ్యాక్టరీ ఉంది. ఈ నేపథ్యంలో ఆర్థిక లావాదేవీల లెక్కలకు సంబంధించి ఐటీ అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఇన్‌కం టాక్స్, ఎన్‌పోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులు సంచలనంగా మారుతున్నాయి. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, రియల్టర్లపై దర్యాప్తు సంస్థలు గురిపెట్టగా.. తాజాగా రంగారెడ్డి జిల్లా తాండూర్ కాంగ్రెస్ అభ్యర్థి బుయ్యని మనోహర్ రెడ్డి సోదరుడి నివాసాలు, ఆఫీసుల్లో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. కొండాపూర్‌లో గల మనోహర్ రెడ్డి సోదరుడి నివాసంలో ఉదయం నుంచి తనిఖీలు చేపడుతున్నారు.
మనోహర్ రెడ్డి సోదరుడు శ్రీనివాస్ రెడ్డికి రంగారెడ్డి జిల్లా తాండూర్ ప్రాంతంలో RBL ఫ్యాక్టరీ ఉంది. ఈ నేపథ్యంలో ఆర్థిక లావాదేవీల లెక్కలకు సంబంధించి ఐటీ అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఇటీవలే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన మనోహర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి తాండూర్ టికెట్ దక్కించుకున్నారు.
ఇటీవల చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వివేక్ నివాసంతోపాటు ఆఫీసుల్లోనూ ఐటీ, ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. వివేక్‌కు చెందిన కంపెనీ అకౌంట్‌లోని డబ్బు పెద్దమొత్తంలో ఓ సెక్యూరిటీ ఏజెన్సీ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ అయినట్లు ఈడీ గుర్తించింది. ఈడీ సూచనమేరకు బ్యాంకు అధికారులు ఆ మొత్తాన్ని సీజ్ చేశారు. దాదాపు రూ.100 కోట్ల అక్రమాలు జరిగినట్లు ఈడీ ప్రకటన విడుదల చేసింది.