ఎన్నికల కోడ్‌ లేని జిల్లాల్లో రేషన్‌ కార్డులివ్వండి

అధికారులకు సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశం

Advertisement
Update:2025-02-17 15:56 IST

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ లేని జిల్లాల్లో కొత్త రేషన్‌ కార్డులు ఇచ్చే ప్రక్రియ ప్రారంభించాలని అధికారులను సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. సోమవారం పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ లో సివిల్‌ సప్లయీస్‌ డిపార్ట్‌మెంట్‌ పై నిర్వహించిన సమీక్షలో కొత్త రేషన్‌ కార్డుల జారీ ప్రక్రియపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలోని అర్హులందరికీ రేషన్‌ కార్డులు ఇవ్వాలని తేల్చిచెప్పారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వాళ్లు మళ్లీ మీ సేవ సెంటర్లకు వెళ్లి దరఖాస్తు చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయని.. ఒకసారి అప్లయ్‌ చేసిన వాళ్లు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదనే విషయంపై అవగాహన కల్పించాలన్నారు. ఎమ్మెల్సీ కోడ్‌ ముగిసిన వెంటనే ఏడు ఉమ్మడి జిల్లాల పరిధిలోనూ కొత్త రేషన్‌ కార్డులు అందజేయాలని సూచించారు. ఈ సందర్భంగా కొత్తగా అందజేయనున్న స్మార్ట్‌ రేషన్‌ కార్డుల నమూనాలను సీఎం పరిశీలించారు.

ఉగాది నుంచి సన్నబియ్యం

రేషన్‌ కార్డుదారులకు ఉగాది నుంచి సన్నబియ్యం అందజేసే ప్రక్రియపైనా రివ్యూలో సీఎం రేవంత్‌ రెడ్డి ఆరా తీసినట్టు తెలిసింది. ఇప్పటి వరకు సివిల్‌ సప్లయీస్‌ డిపార్ట్‌మెంట్‌ దగ్గర ఎంతమేరకు సన్నబియ్యం నిల్వలు ఉన్నాయి.. ప్రతి నెలా కొత్తగా పెరిగే రేషన్‌ కార్డులతో పాటు ఉన్న కార్డుల్లో కుటుంబ సభ్యుల చేరికలతో పెరిగే కోటా ఎంత అనే వివరాలు అడిగి తెలుసుకున్న నెలకు 2 లక్షల టన్నుల బియ్యం అవసరమని అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే రైస్‌ మిల్లర్ల నుంచి 5 లక్షల టన్నుల వరకు సన్నబియ్యం సేకరించామని.. త్వరలోనే మిగతా బియ్యం దశలవారీగా సేకరిస్తామని అధికారులు తెలిపారు. మూడు, నాలుగు నెలల బఫర్‌ స్టాక్‌ పెట్టుకొని సన్నబియ్యం పంపిణీని ఉగాది నుంచే ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని సమావేశంలో సీఎం ఆదేశించినట్టుగా తెలిసింది.

Tags:    
Advertisement

Similar News