రైతుల కంటే రాజకీయమే ముఖ్యమా..? కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్
చిల్లర రాజకీయం చేస్తూ, రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతూ, కేసీఆర్‌ను బద్నాం చేయాలనే అజెండాతో కాంగ్రెస్ ముందుకు సాగుతోందన్నారు. రైతులను నిండా ముంచాలని కాంగ్రెస్ చూస్తోందన్నారు కేటీఆర్.
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర కాఫర్ డ్యాం కట్టేందుకు నిర్మాణ సంస్థ L&T ముందుకు వచ్చినప్పటికీ.. ప్రభుత్వం అడ్డుపడడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీంతో కాంగ్రెస్‌కు రాష్ట్రం, రైతుల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని తేలిపోయిందన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
మేడిగడ్డ దగ్గర కాఫర్ డ్యాం కట్టి, కుంగిన పిల్లర్లకు రిపేర్లు చేసి.. నీళ్లు ఎత్తిపోసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారన్నారు కేటీఆర్. డిపార్ట్‌మెంట్ ఇంజినీర్లు రిపేర్ చేయాలని రిపోర్టు చేసిన తర్వాత కాఫర్ డ్యాం కట్టేందుకు L&T ముందుకు వచ్చిందని చెప్పారు. అందుకు సంబంధించిన వార్తా కథనాలను తన ట్వీట్‌కు జోడించారు కేటీఆర్.
కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కాఫర్ డ్యాం కట్టేందుకు నిరాకరిస్తోందన్నారు కేటీఆర్. కుత్సితమైన చిల్లర రాజకీయం చేస్తూ, రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతూ, కేసీఆర్‌ను బద్నాం చేయాలనే అజెండాతో కాంగ్రెస్ ముందుకు సాగుతోందన్నారు. రైతులను నిండా ముంచాలని కాంగ్రెస్ చూస్తోందన్నారు కేటీఆర్. ఇంత నికృష్ట రాజకీయం కేవలం ఎన్నికలలో లాభం కోసమేనా.? అంటూ ప్రశ్నించారు కేటీఆర్.
అసలు ఏం జరిగిందంటే.?
మరో 45 రోజుల్లో వర్షాకాలం ప్రారంభం కానుండడంతో కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు అత్యవసర మరమ్మతుల నిర్వహణకు రాష్ట్ర నీటిపారుదల శాఖ కసరత్తు ప్రారంభించింది. ప్రధానంగా మేడిగడ్డ బ్యారేజీ మరింత కుంగకుండా 7వ బ్లాక్‌కు రెండు వైపులా షీట్‌పైల్స్‌తో అదనపు రక్షణ కల్పించాలని ENC నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీని కోరినట్టు తెలిసింది. ఐతే ఇందుకు ఎల్ అండ్ టీ సంస్థ ముందుకు వచ్చినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ సూచించే వరకు ఎలాంటి మరమ్మతులు చేపట్టవద్దని అధికారులను ఆదేశించినట్లు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టులోని లోపాలపై అధ్యయనం చేసి, పరిష్కారాలను సూచించడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వవిజ్ఞప్తి మేరకు..నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ...CWC- సెంట్రల్ వాటర్ కమిషన్ ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది. అయితే కమిటీ రాష్ట్రం నుంచి తిరిగి వెళ్లి నెల రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు ఎలాంటి సూచనలు చేయలేదు.