మిర్యాలగూడ కాంగ్రెస్‌లో పొత్తుల చిచ్చు

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ స్థానాన్ని వామపక్షాలకు కేటాయిస్తారనే ప్రచారం జరుగుతుండటంతో అక్కడ కాంగ్రెస్ నాయకులు భగ్గుమంటున్నారు.

Advertisement
Update:2023-10-17 13:47 IST

కాంగ్రెస్‌లో టికెట్ల లొల్లి మొదలైంది. ఇప్పటికే తొలి జాబితాలో 55 మంది అభ్యర్థులు పేర్లు ప్రకటించారు. దీంతో టికెట్ కోసం ఆశపడి భంగపడిన నాయకులు అసమ్మతి రాగం వినిపిస్తున్నారు. పలు చోట్ల కీలకమైన నాయకులు కాంగ్రెస్ పార్టీని వదిలేసి బీఆర్ఎస్‌లో చేరుతున్నారు. బీఆర్ఎస్‌లో టికెట్ వచ్చే పరిస్థితి లేకపోయినా.. రాజకీయ భవిష్యత్‌పై భరోసా ఉంటుందనే అంచనాలతో అధికార పార్టీలో చేరుతున్నారు. ఇక కాంగ్రెస్‌తో వామపక్షాల పొత్తు ఉంటే.. పలు స్థానాల్లో కాంగ్రెస్ టికెట్లు గల్లంతవుతాయనే అంచనాలతో పలువురు నాయకులు హైరానా పడుతున్నారు.

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ స్థానాన్ని వామపక్షాలకు కేటాయిస్తారనే ప్రచారం జరుగుతుండటంతో అక్కడ కాంగ్రెస్ నాయకులు భగ్గుమంటున్నారు. ఇప్పటికే అక్కడ టికెట్ ఆశిస్తున్న బత్తుల లక్ష్మారెడ్డి కాంగ్రెస్ నాయకత్వానికి హెచ్చరికలు పంపారు. మిర్యాలగూడ టికెట్ కాంగ్రెస్‌కు కాకుండా సీపీఎంకు కేటాయిస్తే తిరుగుబాటు తప్పదనే సంకేతాలు ఇచ్చారు. తాజాగా మిర్యాలగూడలో వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలతో ఆయన ర్యాలీ కూడా చేపట్టారు.

'ఇండియా' కూటమిలో కాంగ్రెస్‌తో పాటు సీపీఐ, సీపీఎం కూడా ఉన్నాయి. దీంతో తెలంగాణ ఎన్నికల్లో కలిసి వెళ్లాలనే నిర్ణయానికి వచ్చాయి. అయితే ఏయే సీట్లను వామపక్షాలకు సర్థుబాటు చేస్తారనే విషయంపై క్లారిటీ రాలేదు. కాగా సీపీఎంకు మిర్యాలగూడ టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది. దీంతో స్థానిక కాంగ్రెస్ నాయకులు భగ్గుమంటున్నారు. జాతీయ స్థాయిలో మూడు పార్టీల నాయకులు సఖ్యతగా ఉన్నా.. క్షేత్ర స్థాయిలో మాత్రం ఈ పార్టీల పొత్తులు పొసగడం లేదు.

పొత్తులో భాగంగా తమకు భద్రాచలం, పాలేరు, ఇబ్రహీంపట్నం, మిర్యాలగూడ స్థానాలు కావాలని సీపీఎం కోరుతోంది. అయితే భద్రాచలం, పాలేరు, ఇబ్రహీంపట్నం ఇవ్వడం కుదరదని కాంగ్రెస్ తెగేసి చెప్పింది. మిర్యాలగూడతో పాటు గెలిచిన తర్వాత ఒక ఎమ్మెల్సీ స్థానం ఇస్తామని హామీ ఇచ్చింది. దీనిపై ఇరు పార్టీల మధ్య ఒప్పందం కుదరలేదు. కానీ మిర్యాలగూడ కాంగ్రెస్ నాయకులు మాత్రం సీపీఎంకు కేటాయిస్తే సహకరించేదే లేదని తెగేసి చెబుతున్నారు.

మిర్యాలగూడ నుంచి బత్తుల లక్ష్మారెడ్డి, కుందూరు జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్‌తో పాటు 18 మంది టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే మిర్యాలగూడ కాంగ్రెస్‌లో బత్తుల లక్ష్మారెడ్డి వ్యతిరేకం వర్గం ఆయనకు టికెట్ రాకుండా ప్రయత్నాలు చేస్తోంది. టికెట్ కోసం భారీగా దరఖాస్తులు చేయడం వెనుక కారణం కూడా ఇదే అనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో బీఎల్ఆర్ కూడా టికెట్ కోసం భారీగా లాబీయింగ్ చేస్తున్నారు. ఇలాంటి దశలో అసలు మిర్యాలగూడ టికెట్ కాంగ్రెస్‌కు కాకుండా.. సీపీఎంకు కేటాయిస్తారనే వార్త ఇప్పుడు చిచ్చు రేపుతోంది. సహచరుడికి టికెట్ రాకుండా చేద్దామని భావించిన కాంగ్రెస్ నాయకులకు.. అసలు టికెట్ తమ పార్టీకే రాదని తెలిసి హైరానా పడుతున్నారు.

ప్రస్తుతం మిర్యాలగూడలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీకి కనుక టికెట్ కేటాయించకపోతే భారీగా నష్టపోయే అవకాశం ఉంది. సీపీఎంకు కనుక టికెట్ కేటాయిస్తే కాంగ్రెస్ శ్రేణులు ఏ మేరకు సహకరిస్తాయనే అనుమానాలు కూడా ఉన్నాయి. మొత్తానికి వామపక్షాల పొత్తుతో లాభపడదామని అనుకుంటున్న కాంగ్రెస్‌కు క్షేత్ర స్థాయి పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి.

Tags:    
Advertisement

Similar News