తారుమారు త‌క్క‌ర్‌మార్‌.. అభ్య‌ర్థులు వారే, పార్టీలు మారారు

గతంలో విప‌క్షంలో ఉన్న వారు ఇప్పుడు అధికార పార్టీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగితే.. అధికార పార్టీ అభ్య‌ర్థులుగా ఉన్న‌వారు ఇప్పుడు విప‌క్ష క్యాండిడేట్‌గా తెర‌పైకి వ‌చ్చారు.

Advertisement
Update:2023-10-16 15:20 IST

ఫ‌లానా అభ్య‌ర్థి ఫ‌లానా పార్టీ నుంచి నిల‌బ‌డ‌తారు. ఆ పార్టీ న‌చ్చో, అభ్య‌ర్థి న‌చ్చో వారికి ఓటేసి గెలిపిస్తారు ప్ర‌జ‌లు. కానీ, ఈ ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లోని పలు నియోజక‌వ‌ర్గాల్లో అభ్య‌ర్థులు వారే.. కానీ పార్టీలు మారారు. గతంలో విప‌క్షంలో ఉన్న వారు ఇప్పుడు అధికార పార్టీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగితే.. అధికార పార్టీ అభ్య‌ర్థులుగా ఉన్న‌వారు ఇప్పుడు విప‌క్ష క్యాండిడేట్‌గా తెర‌పైకి వ‌చ్చారు. దీంతో ప్ర‌జ‌లు పార్టీ చూసి ఓటేస్తారా, అభ్య‌ర్థుల‌ను చూసి మ‌ద్ద‌తిస్తారా అనేది ఆస‌క్తిక‌రంగా మారింది.

కొల్లాపూర్‌లో జూప‌ల్లి వ‌ర్సెస్ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌రెడ్డి

ఉమ్మ‌డి మ‌హబూబ్‌న‌గ‌ర్ జిల్లా కొల్లాపూర్‌లో ఇదే ప‌రిస్థితి. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ గులాబీ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరి టికెట్ తెచ్చుకున్నారు. ఆయ‌న‌పై కాంగ్రెస్ నుంచి గెలిచిన హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌రెడ్డి బీఆర్ఎస్‌లో చేరి కృష్ణారావుతో పోటీకి సై అంటున్నారు. అభ్య‌ర్థులు వారే కానీ, పార్టీలు అటు ఇటు అవ‌డంపై ప్ర‌జ‌లు ఆస‌క్తిగా చ‌ర్చించుకుంటున్నారు.

న‌కిరేక‌ల్ వేముల వీరేశం వ‌ర్సెస్ లింగ‌య్య‌

అలాగే న‌ల్గొండ జిల్లా న‌కిరేక‌ల్‌లో గ‌త ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడిన వేముల వీరేశం ఇప్పుడు టికెట్ ద‌క్క‌క కాంగ్రెస్‌లో చేరారు. హ‌స్తం పార్టీ త‌ర‌ఫున బరిలో నిలిచారు. కాంగ్రెస్ నుంచి బ‌రిలో దిగి వీరేశాన్ని ఓడించిన లింగ‌య్య త‌ర్వాత బీఆర్ఎస్‌లో చేరారు. ఈసారి కారు గుర్తుతో పోటీ చేయ‌బోతున్నారు. అంటే ఇక్క‌డ కూడా అభ్య‌ర్థులు వారే.. కాక‌పోతే పార్టీలే మారాయి. కాంగ్రెస్ ఇంకా 64 మంది అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించాల్సి ఉండ‌టం, బీజేపీ జాబితా ఇంకా విడుద‌ల‌కాక‌పోవ‌డంతో రానున్న రోజుల్లో ఈ లిస్ట్‌ మ‌రింత పెరిగే అవ‌కాశం క‌నిపిస్తోంది.

Tags:    
Advertisement

Similar News