సీఎం, మంత్రి పదవులు అడగలేదు.. పార్టీ పదవే అడిగాను : కోమటిరెడ్డి వెంకటరెడ్డి
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే తప్పకుండా ఆరు నెలల ముందే అభ్యర్థులను ప్రకటించాలని వెంకటరెడ్డి సూచించారు.
కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చాన్నాళ్ల తర్వాత బయటకు వచ్చారు. తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కారణంగా మునుగోడు ఉపఎన్నిక వచ్చిన తర్వాత నుంచి ఆయన పార్టీ కార్యక్రమాలకు కూడా దూరమయ్యారు. ఉపఎన్నిక దగ్గర పడుతున్నా.. ప్రచారంలో మాత్రం పాలు పంచుకోవడం లేదు. పైగా కుటుంబంతో సహా ఆయన ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్తారనే వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో గురువారం ఆయన భువనగిరి జిల్లా గుండాల మండలంలో పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ అంటేనే కోమటిరెడ్డి అని.. తాను చనిపోయే వరకు పార్టీని వీడే ప్రసక్తే లేదని చెప్పారు. '25 ఏళ్ల నుంచి నిజాయితీగా బతికాను తప్ప ఎక్కడా తప్పు చేయలేదు. తాను పార్టీ పదవే అడిగాను తప్ప మంత్రి, సీఎం పదవులను అడగలేదు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కార్యకర్తలను కాపాడుకుంటూ వస్తున్నాను. జనగామ, చేర్యాల వంటి ప్రాంతాలకు వెళ్లినా నా గురించి అందరూ చెప్తారు. ఏనాడైనా ఎవరికైనా అవసరం ఉందని వాట్సప్ మెసేజ్ పెడితే ఉదయాన్నే చూసుకొని వారికి అవసరమైన సాయం చేశాను. ఎంతో మంది విద్యకు డబ్బులు ఇచ్చాను. కానీ అవన్నీ నేను చెప్పుకోను'అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే తప్పకుండా ఆరు నెలల ముందే అభ్యర్థులను ప్రకటించాలని ఆయన సూచించారు. ప్రతీ అభ్యర్థి విషయంలో సర్వే చేసి ఎంపిక చేయాలని ఆయన అన్నారు. ఈ విషయంపై తాను అధిష్టానానికి లేఖ రాస్తానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పుకొచ్చారు. ఇంత చెప్పినా ఆయన మాత్రం మునుగోడు ప్రచారానికి వస్తారా లేదా అనే విషయాన్ని మాత్రం స్పష్టం చేయలేదు. అక్కడ ఎవరికి తాను మద్దతు ఇస్తున్నారో కూడా వెల్లడించలేదు. అలాగే ఆస్ట్రేలియా పర్యటనపై, భారత్ జోడో యాత్రలో పాల్గొనే విషయంపై ఆయన స్పష్టత ఇవ్వలేదు.