'నేను పార్టీ వీడుతానన్న వార్తలు అబద్దం' -కోమటి రెడ్డి వెంకటరెడ్డి
మీడియాలో, సోషల్ మీడియాలో నిరాధారమైన వార్తలతో తనను నమ్ముకున్న కార్యకర్తలను, కాంగ్రెస్ పార్టీని కొందరు అయోమయానికి గురిచేస్తున్నారని కోమటి రెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. ఒకవేళ పార్టీ మారదల్చుకుంటే ముందుగా చెప్పే మారుతానని, పార్టీ మారేవాడినే అయితే పీసీసీ అధ్యక్ష పదవి తనకు ఇవ్వనప్పుడే మారేవాడినని ఆయన అన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెంకట రెడ్డి పార్టీకి రాజీనామా చేస్తున్నాడంటూ ఈ రోజు ఉదయం నుంచి ప్రచారం జరుగుతోంది. కొన్ని న్యూస్ ఛానళ్ళు కూడా ఆ వార్తలను ప్రసారం చేశాయి. ఈ నేపథ్యంలో తాను పార్టీకి రాజీనామా చేస్తున్నాననే మాట అబద్దమని కోమటి రెడ్డి ప్రకటించారు.
మీడియాలో, సోషల్ మీడియాలో నిరాధారమైన వార్తలతో తనను నమ్ముకున్న కార్యకర్తలను, కాంగ్రెస్ పార్టీని కొందరు అయోమయానికి గురిచేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఒకవేళ పార్టీ మారదల్చుకుంటే ముందుగా చెప్పే మారుతానని, పార్టీ మారేవాడినే అయితే పీసీసీ అధ్యక్ష పదవి తనకు ఇవ్వనప్పుడే మారేవాడినని కోమటి రెడ్డి అన్నారు.
పార్టీ నాయకత్వం పై ఆయన ఈ మధ్య తరచుగా అసంత్రుప్తి వ్యక్తం చేయడం, పలు కామెంట్లు చేయడం నేపథ్యంలో ఈ వార్తలు ప్రచారం అయ్యాయి. దీనిపై కోమటి రెడ్డి స్పందిస్తూ, పార్టీ అధిష్టానంపై కొన్ని కామెంట్లు చేసిన మాట వాస్తవమే అయినప్పటికీ సోనియా, రాహుల్ గాంధీతో చర్చల తర్వాత మనసు మార్చుకున్నానన్నారు. తన సేవల్ని పార్టీ కోసం ఉపయోగించుకుంటామని చెప్పారని.. కోమటిరెడ్డి తెలిపారు.
పార్టీ మార్పు ప్రచారాలు నమ్మొద్దంటూ కార్యకర్తలకు, ప్రజలకు సూచించారు. పార్టీ మారేది ఉంటే కార్యకర్తలని, అభిమానుల్ని సంప్రదించి నిర్ణయం తీసుకుంటానంటూ స్పష్టం చేశారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే ఎమ్మెల్యేగా, లేదా ఎంపీగా పోటీ చేస్తానన్నారు. పార్టీలో పదవి వస్తుందని ఆశిస్తున్నాను. పార్టీ మారే ప్రసక్తి లేదంటూ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి క్లారిటీ ఇచ్చారు.