Hyderabad: క్రికెట్ టిక్కట్లు బ్లాక్... ఒక్కో టిక్కట్ 6 వేలు
ఈ రోజు హైదరాబాద్ లో జరగనున్న క్రికెట్ మ్యాచ్ టిక్కట్లను బ్లాక్ లో అమ్ముతున్న కొందరిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. 1500 రూపాయల టిక్కట్ ను 6 వేల రూపాయలకు అమ్ముతుండగా వాళ్ళను పట్టుకున్నారు.
ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ లో జరగనున్న ఇండియా, ఆస్ట్రేలియా టీ 20 మ్యాచ్ టిక్కట్ల అమ్మకాల వ్యవహారంపై ఇప్పటికే అనేక ఆరోపణలు వస్తున్నాయి. పది శాతం టిక్కట్లు కూడా ప్రేక్షకులకు అమ్మలేదని మొత్తం టిక్కట్లు బ్లాక్ చేశారని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. జింఖానా గ్రౌండ్స్ లో టిక్కట్ల అమ్మకంలో రేగిన గందరగోళం మర్చిపోలేం. వేల మంది అభిమానులు టిక్కట్లు కొనడానికి వస్తే మూడు వేల టిక్కట్లు కూడా అమ్మలేదు. ఫ్యాన్స్ ను కంట్రోల్ చేయడం పోలీసుల వల్ల కూడా కాలేదు. తొక్కిసలాటలో అనేక మంది గాయపడ్డారు.
ఇంత జరుగుతున్నా HCA మాత్రం పట్టించుకోలేదు. తామేమీ తప్పు చేయలేదంటూ HCA అధ్యక్షుడు అజారుద్దీన్ ప్రకటన చేసేశారు. బ్లాక్ లో టిక్కట్లు అమ్మడం లేదంటు చెప్పారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్ అయ్యింది. టిక్కట్లు బ్లాక్ లో అమ్మారని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు క్రీడా శాఖా మంత్రి శ్రీనివాస్ గౌడ్.
ఈ నేపథ్యంలో జింఖానా గ్రౌండ్స్ లో బ్లాక్ లో టిక్కట్లు అమ్ముతున్న నలుగురిని సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. 1500 రూపాయల టిక్కెట్లను 6వేల రూపాయలకు అమ్ముతుండగా వీరిని పట్టుకున్న పోలీసులు బేగంపేట పోలీసులకు అప్పగించారు.
మరో వైపు నాగోల్ లో కూడా టిక్కట్ల ను బ్లాక్ లో అమ్ముతున్న ముగ్గురు వ్యక్తులను ఎల్ బీ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. వీరు 1000 రూపాయల టిక్కట్లను 5 వేలకు, 1500 టిక్కట్లను 6 వేలకు అమ్ముతున్నారు.
అయితే ఇప్పటికే వేలాది టిక్కట్లు బ్లాక్ లో అమ్ముడు పోయాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.