ఏడుపాయల వనదుర్గామాతను దర్శించుకున్న సీఎం రేవంత్
జిల్లాలో రూ. 192 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శ్రీకారం
సీఎం రేవంత్‌రెడ్డి మెదక్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి మెదక్ వచ్చిన సీఎం ముందుగా ఏడుపాయలలో వనదుర్గామాతను ఆయన దర్శించుకున్నారు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం వెంట మంత్రులు దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు. అనంతరం జిల్లాలో రూ. 192 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శ్రీకారం చుట్టారు. రూ. 52. 76 కోట్లతో మెదక్ నియోజకవర్గంలో వివిధ గిరిజన గ్రామాలను కలుపుతూ రోడ్ల నిర్మాణం, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కాంప్లెక్స్, రూ. 5 కోట్లతో ఇందిరా మహిళా శక్తి భవన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ. 35 కోట్ల తో ఏడుపాయల వద్ద రోడ్డు విస్తరణ, డివైడర్ల నిర్మాణం, హైమాస్డ్ లైట్ల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. మెదక్ జిల్లా స్వయం సహాయ సంఘాలకు రూ. 100 కోట్ల బ్యాంక్ లింకేజ్ చెక్ అందించారు. ఈ సందర్భంగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు వివిధ అభివృద్ధి పనులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రికి వినతి పత్రం అందజేశారు.