దానంకు హైకోర్టు నోటీసులు.. ఖైరతాబాద్ లో ఉప ఎన్నిక తప్పదా..?

తెలంగాణ హైకోర్టు దానం నాగేందర్ తో పాటు, న్యాయశాఖ కార్యదర్శి, స్పీకర్‌ కార్యాలయం, ఎన్నికల సంఘానికి కౌంటర్లు దాఖలు చేయాలని నోటీసులు జారీ చేసింది. కేసు విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది.

Advertisement
Update:2024-04-16 10:30 IST

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఫిరాయింపులు కూడా జోరందుకున్నాయి. ఇప్పటికే ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇంకొందరు సీఎం రేవంత్ రెడ్డితో ములాఖత్ అయినా.. గోడమీది పిల్లివాటంతో ఉన్నారు. నేరుగా కండువా కప్పుకున్న వారిలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మరో అడుగు ముందుకేసి ఏకంగా కాంగ్రెస్ టికెట్ పై సికింద్రాబాద్ ఎంపీ స్థానానికి పోటీ చేస్తున్నారు. ఫిరాయింపులకే ఇది పరాకాష్టగా చెప్పుకోవాలి. దీంతో దానంపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. ఆల్రడీ స్పీకర్ ని కలసి ఫిర్యాదు చేసింది. మార్చి 14న ఫిర్యాదు చేసినా, ఇంతవరకు స్పీకర్ చర్యలు తీసుకోలేదంటూ.. తాజాగా హైకోర్టుని కూడా ఆశ్రయించారు ఆ పార్టీ నేతలు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు దానం నాగేందర్ కు నోటీసులిచ్చింది.

మిగతా నాయకులు కండువాలు మాత్రమే కప్పుకున్నారు, కానీ దానం నాగేందర్ ఏకంగా కాంగ్రెస్ టికెట్ పై బరిలో దిగుతున్నారు. ఈ విషయం బీఆర్ఎస్ కి మరింత ఇబ్బందిగా మారింది. దీంతో వెంటనే ఆయనపై అనర్హత వేటు వేయాలంటూ స్పీకర్ కి ఫిర్యాదు చేశారు నేతలు. స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో రిజిస్టర్ పోస్ట్ లో పంపించారు. అయినా స్పందన లేకపోవడంతో చివరకు హైకోర్టులో పిటిషన్ వేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. ఈ వ్యవహారంలో స్పీకర్ కి కూడా నోటీసులివ్వాలని కోరారు.

స్పీకర్ కి నోటీసులివ్వడం సరికాదని, ఆ స్థానానికి గౌరవం ఇవ్వాలని అడ్వొకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. కావాలంటే స్పీకర్ కార్యాలయానికి నోటీసులు ఇవ్వొచ్చని పేర్కొన్నారు. దీంతో తెలంగాణ హైకోర్టు దానం నాగేందర్ తో పాటు, న్యాయశాఖ కార్యదర్శి, స్పీకర్‌ కార్యాలయం, ఎన్నికల సంఘానికి కౌంటర్లు దాఖలు చేయాలని నోటీసులు జారీ చేసింది. కేసు విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది.

కాంగ్రెస్ లాజిక్..

పార్టీ ఫిరాయించిన వారిపై వేటు వేయాలనడం కరెక్టే కానీ.. బీఆర్ఎస్ హయాంలో జరిగింది ఏంటంటూ కాంగ్రెస్ నేతలు లాజిక్ తీస్తున్నారు. 2019లో గత ప్రభుత్వ హయాంలో పార్టీ ఫిరాయింపులపై ఇచ్చిన ఫిర్యాదులను 2023 దాకా తేల్చలేదని వారు కౌంటర్ ఇస్తున్నారు. ఇప్పుడెందుకు బీఆర్ఎస్ నేతలు హడావిడి చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. మరి కోర్టు నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి. దానంపై అనర్హత వేటు పడితే మాత్రం ఖైరతాబాద్ కి ఉప ఎన్నికలు అనివార్యం అవుతాయి. దానంతోపాటు పార్టీ మారిన వరంగల్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం బాలరాజుపై కూడా అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. 

Tags:    
Advertisement

Similar News