కాంగ్రెస్ కి ఓటు వేస్తే జిల్లాలు రద్దవుతాయి జాగ్రత్త..

లింగంపల్లిలో ఎండిపోయిన పంటపొలాలను పరిశీలించారు హరీష్ రావు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం రూ.25 వేలు పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

Advertisement
Update:2024-04-01 09:33 IST

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కి ఓటు వేస్తే మీ కొత్త జిల్లాలు రద్దవుతాయి జాగ్రత్త అంటూ ప్రజలను హెచ్చరించారు మాజీ మంత్రి హరీష్ రావు. పరిపాలనా సౌలభ్యం కోసం కేసీఆర్‌ కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తే వాటిని తగ్గించేందుకు రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. తమ హయాంలో కొత్త జిల్లాలతోపాటు, జిల్లాకో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేశామని గుర్తు చేశారాయన. సీఎం రేవంత్‌రెడ్డి 17 జిల్లాలు సరిపోతాయని అంటున్నారని, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేస్తే మీ జిల్లా కచ్చితంగా రద్దవుతుందని హెచ్చరించారు. ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. బీఆర్ఎస్ టికెట్ పై గెలిచి పార్టీ మారిన బీబీ పాటిల్ ని ఈసారి చిత్తు చిత్తుగా ఓడించాలన్నారు. జహీరాబాద్ లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ ని గెలిపించాలని పిలుపునిచ్చారు హరీష్ రావు.

అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీల్లో కనీసం నాలుగు కూడా పూర్తి చేయలేదని చెప్పారు హరీష్ రావు. హామీలు అమలు చేయలేని సీఎం రేవంత్‌రెడ్డికి లోక్ సభ ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కులేదన్నారు. హామీల అమలుని విస్మరించిన కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తక్కువ రోజుల్లోనే ప్రజల్లో వ్యతిరేకత మొదలైందన్నారు. ఈ వ్యతిరేకతను కప్పిపుచ్చుకోడానికి లీకులు, ఫేక్‌ న్యూస్‌లు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పొరపాటున ఈసారి కూడా వాళ్లకు ఓటేస్తే మోసపోతామని హెచ్చరించారు. రూ.2 లక్షలు రుణం మాఫీ చేయకపోయినా, రూ.500 బోనస్‌ ఇవ్వకపోయినా, మహిళలకు రూ.2,500 జమ చేయకపోయినా తమకు ప్రజలు ఓట్లు వేశారని చెబుతూ కాంగ్రెస్ నేతలు హామీలు అమలు చేయకుండా తప్పించుకునే ప్రమాదం ఉందన్నారు హరీష్ రావు.

ఆ ఇద్దరూ రాజీనామా చేయాల్సిందే..

బీఆర్‌ఎస్‌ టికెట్ పై గెలిచి కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరి, దానం నాగేందర్‌ ఎమ్మెల్యే పదవులకు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు హరీష్ రావు. నాయకులు పోయినంత మాత్రాన పార్టీకి నష్టం లేదని, కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకుంటామని ధీమాను వ్యక్తం చేశారు. నాలుగు రోజులాగితే చేరికలతో కాంగ్రెస్ లో గొడవలు మొదలవుతాయని చెప్పారు. వాళ్లలో వాళ్లే తన్నుకుంటారని ఎద్దేవా చేశారు హరీష్ రావు. 

Tags:    
Advertisement

Similar News