వంట అయ్యాక గరిటె తిప్పినట్టు..
చేయని పనులకు డబ్బా కొట్టుకోవడం బదులు, ఎన్నికల వేళ ఇచ్చిన హామీల అమలుపై శ్రద్ధ చూపాలని కాంగ్రెస్ నేతలకు హితవు పలికారు హరీష్ రావు.
తెలంగాణలో స్టాఫ్ నర్సు పోస్ట్ ల భర్తీ ప్రక్రియ బీఆర్ఎస్ హయాంలో జరిగిందని, ఇప్పుడు వారికి నియామక పత్రాలు ఇస్తూ కాంగ్రెస్ హడావిడి చేస్తోందని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. బీఆర్ఎస్ ప్రభుత్వం వంట పూర్తి చేస్తే, కాంగ్రెస్ వచ్చి గరిటె తిప్పి ఆ ఘనతను తమ ఖాతాలో వేసుకోవాలని చూస్తోందని విమర్శించారు. చేయని పనులకు డబ్బా కొట్టుకోవడం బదులు, ఎన్నికల వేళ ఇచ్చిన హామీల అమలుపై శ్రద్ధ చూపాలని ఆయన కాంగ్రెస్ నేతలకు హితవు పలికారు.
ఆ ఘనత గత ప్రభుత్వానిదే..
5,204 స్టాఫ్ నర్స్ పోస్టులకు 2022 డిసెంబర్ 30న నోటిఫికేషన్ విడుదల చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. 2023 జూన్ 22న 1,890 పోస్టులను కలుపుతూ మళ్లీ ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 7,094 పోస్ట్ లకు 2023 ఆగస్టు 2న పరీక్ష నిర్వహించారు. తుది ఫలితాలు విడుదలకు ఎన్నికల కోడ్ అడ్డు రావడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. ఈలోగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. హడావిడిగా నియామక పత్రాలు జారీ చేసేందుకు పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టింది. ఆ ఘనతను కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది.
పక్కదారి పట్టించడానికేనా..?
2024 ఫిబ్రవరి 1న గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేస్తామని కాంగ్రెస్ అట్టహాసంగా ప్రకటించిందని, ఇప్పుడు ఆ హామీని అటకెక్కించబోతోందని విమర్శించారు హరీష్ రావు. విద్యార్థుల దృష్టి మరల్చడానికే ముందు రోజున స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు జారీ చేస్తున్నారని, హంగు ఆర్భాటాలతో ఈ కార్యక్రమం జరపాలనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ వైద్య ఆరోగ్య రంగాన్ని దేశంలోనే నెంబర్ 1 స్థానానికి చేర్చే లక్ష్యంలో భాగంగా పెద్ద సంఖ్యలో ఆస్పత్రులు నిర్మించామని, జిల్లాకో మెడికల్ కాలేజీని అప్పటి తమ ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు హరీష్ రావు. వైద్య సిబ్బంది కొరత లేకుండా ఉండేందుకు మెడికల్, నర్సింగ్, పారామెడికల్, ఫార్మాసిస్టు, ఇతర సిబ్బంది రిక్రూట్మెంట్ కు తామే శ్రీకారం చుట్టామన్నారు.
నోటిఫికేషన్లు ఎప్పుడు?
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం, ఏడాదిలోగా 2 లక్షల పోస్టులను భర్తీ చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. జాబ్ క్యాలెండర్ పేరిట పత్రికల్లో ప్రకటనలు విడుదల చేసిన కాంగ్రెస్.. ఫిబ్రవరి 1న గ్రూప్ 1 నోటిఫికేషన్, ఏప్రిల్ 1న గ్రూప్ 2, జూన్ 1న గ్రూప్ 3,4 నియామకాలకు నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మార్చి1న పోలీసు సహా ఇతర యూనిఫాం పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ హామీలను నమ్మి ఉద్యోగ నియామక ప్రకటనలకోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు, విద్యార్థులకు న్యాయం చేయాలన్నారు హరీష్ రావు.