కిషన్ రెడ్డి అధ్యక్ష పదవిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
తెలంగాణకు బీజేపీ ఇచ్చింది లేదని, కాంగ్రెస్ పార్టీ చేసింది లేదని ఎద్దేవా చేశారు మంత్రి హరీష్ రావు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ ని తీసేసి కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించింది అధిష్టానం. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుకోసమే ఈ మార్పు అని అంటున్నారు ఆ పార్టీ నేతలు. అయితే కిషన్ రెడ్డి ఓ ఔట్ డేటెడ్ లీడర్ అంటూ సెటైర్లు పేల్చారు మంత్రి హరీష్ రావు. ప్రతిపక్షాలు అధ్యక్షులను మార్చినా, ఔట్ డేటెడ్ లీడర్లకు పట్టం కట్టినా తెలంగాణలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం తథ్యమన్నారు.
తెలంగాణకు బీజేపీ ఇచ్చింది లేదని, కాంగ్రెస్ పార్టీ చేసింది లేదని ఎద్దేవా చేశారు మంత్రి హరీష్ రావు. పటాన్ చెరువులో R&B గెస్ట్ హౌస్, ఫ్రీడం పార్కులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో బీజేపీ, కాంగ్రెస్ పై మండిపడ్డారు హరీష్ రావు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్స్ వంటి పథకాలు ఎందుకు అమలు చేయట్లేదని ప్రశ్నించారు. రిజెక్టెడ్ లీడర్లు, స్క్రాప్ లీడర్లు పార్టీ మారినంత మాత్రాన తమకు పోయేదేమీ లేదన్నారు. బీజేపీ, కాంగ్రెస్ ఎన్ని ట్రిక్కులు చేసినా, హ్యాట్రిక్ కొట్టేది బీఆర్ఎస్ మాత్రమేనని తేల్చిచెప్పారు హరీష్ రావు.
కేంద్ర ప్రభుత్వం అడిగింది ఇవ్వకుండా, అసలు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా మోసం చేసిందని ధ్వజమెత్తారు హరీష్ రావు. దక్షిణ భారత దేశం అభివృద్ధిపై బీజేపీకి చిన్నచూపు ఎందుకని ప్రశ్నించారు. బీజేపీ దక్షిణాది రాష్ట్రాలకు ఏమైనా ఇచ్చిందంటే అవి కేవలం శుష్కప్రియాలు, శూన్య హస్తాలు మాత్రమేనన్నారు. తమ ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తున్న బీఆర్ఎస్ కే ప్రజలు మరోసారి పట్టం కడతారని అన్నారు హరీష్ రావు.