కేటీఆర్ వద్దకు చేరిన జీవో-46 బాధితుల పంచాయితీ

జీవో-46 బాధితుల పోరాటానికి బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందని తెలిపారు కేటీఆర్. న్యాయ పోరాటానికి కూడా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

Advertisement
Update:2024-08-10 08:34 IST

తెలంగాణలో కొన్ని వర్గాల వారు తమ ఇబ్బందులు చెప్పుకోవాలనుకున్నా ప్రభుత్వం వినే పరిస్థితిలో లేదు. అందుకే వారు నేరుగా ప్రతిపక్షాన్ని ఆశ్రయిస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి తమ గోడు చెప్పుకుంటున్నారు. ప్రజా పోరాటానికి ఆయన మద్దతు కోరుతున్నారు. కొడంగల్ రైతులు తమ భూములకోసం జరిగే పోరాటంలో కేటీఆర్ మద్దతు కోరగా, తాజాగా జీవో-46 బాధితులు కేటీఆర్ ని కలసి తమ బాధలు చెప్పుకున్నారు.


అసలేంటి సమస్య..?

2022లో 5,010 స్పెషల్‌ పోలీసు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల కాగా.. అప్పుడు జీవో 46 తెరపైకి వచ్చింది. ఆ జీవో వల్ల ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్‌, వరంగల్‌ జిల్లాల యువతకు అన్యాయం జరిగిందనే వాదన ఉంది. వారికి బదులుగా హైదరాబాద్ ప్రాంతానికి చెందిన వారికి ఉద్యోగాలు వచ్చాయి. గ్రామీణ ప్రాంతాలకు చెందిన మెరిట్ విద్యార్థులు నష్టపోయారు. ఆ జీవోని సవరించాలని గత ప్రభుత్వంపై కూడా ఒత్తిడి ఉంది. జీవో సవరిస్తామని, బాధితులకు న్యాయం చేస్తామని కూడా బీఆర్ఎస్ నేతలు హామీ ఇచ్చారు. అంతలోనే ఎన్నికల కోడ్ రావడంతో సవరింపుకి అవకాశం లేకుండా పోయింది. అసెంబ్లీ ఎన్నికల వేళ జీవో-46 రద్దు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇవ్వడంతో యువత వారిపై ఆశలు పెట్టుకుంది. తీరా అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ నేతలు మొహం చాటేస్తున్నారు. 8 నెలలు గడిచినా పట్టించుకునేవారే లేరు. దీంతో ఆ జీవో బాధితులు కేటీఆర్ వద్దకు వచ్చారు.

జీవో-46తో మెరిట్‌ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని, దాదాపు 2,500 మంది నష్టపోయామని అంటున్నారు బాధితులు. ఇప్పటికే ఉద్యోగాలు పొందిన వారిని తొలగించాలనేది తమ ఉద్దేశం కాదని వారు అంటున్నారు. జీవో సవరించి బ్యాక్‌ లాగ్‌పోస్టులు, సూపర్‌ న్యూమరరీ పోస్టులు కల్పించి మెరిట్‌ అభ్యర్థులతో భర్తీ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. వారి పోరాటానికి బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందని తెలిపారు కేటీఆర్. న్యాయ పోరాటానికి కూడా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. జీవో-46 బాధితులకు వెంటనే న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కేటీఆర్. 

Tags:    
Advertisement

Similar News