హైదరాబాద్ లో సెల్ఫీ వాల్స్... GHMC న్యూ కాన్సెప్ట్
గోడలపై ఆకర్షణీయమైన బ్యాక్‌డ్రాప్ లతో అందమైన పెయింటింగ్ లను చిత్రించి ఈ గోడల ముందు నిల్చొని ప్రజలు సెల్ఫీలు తీసుకునే విధంగా ప్రోత్సహించడం, అక్కడ ఎవ్వరూ చెత్త వేయకుండా చేయడమే ఈ సెల్ఫీ గోడల కాన్సెప్ట్ వెనక ఉన్న భావన.
బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయడం, వాల్ పోస్టర్లు అతికించడం వంటి పద్ధతులను నిరుత్సాహపరిచేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఓ వినూత్న కాన్సెప్ట్‌తో ముందుకు వచ్చింది.
చెత్తాచెదారం జరిగే అవకాశం ఉన్న గోడలను ఆకర్షణీయమైన, రంగురంగుల సెల్ఫీ గోడలుగా మారుస్తున్న్నారు అధికారులు.
గోడలపై ఆకర్షణీయమైన బ్యాక్‌డ్రాప్ లతో అందమైన పెయింటింగ్ లను చిత్రించి ఈ గోడల ముందు నిల్చొని ప్రజలు సెల్ఫీలు తీసుకునే విధంగా ప్రోత్సహించడం, అక్కడ ఎవ్వరూ చెత్త వేయకుండా చేయడమే ఈ సెల్ఫీ గోడల కాన్సెప్ట్ వెనక ఉన్న భావన.
కూకట్‌పల్లి మండలం చింతల్(హెచ్‌ఎంటీ రోడ్డు)లో సీతాకోక చిలుకల నేపథ్యంతో కూడిన సెల్ఫీ వాల్‌లు, సూరారంలో బైసెప్స్‌తో కూడిన సెల్ఫీ వాల్, బెలూన్‌లతో చిత్రించిన మరో సెల్ఫీ వాల్ ఇప్పటికే జనాలు,యువకుల్లో క్రేజీగా మారాయి.
ఇతర ప్రాంతాలతో పోలిస్తే సెల్ఫీ గోడలు ఉన్నచోట పారిశుద్ధ్య సిబ్బంది తక్కువ శ్రమతో ప్రాంగణాలను శుభ్రంగా ఉంచుకోగలుగుతున్నారని GHMC తెలిపింది. స్థానికులు సెల్ఫీల కోసం గోడలను వాడుకోవడంతో ఇక్కడ చెత్తాచెదారం వేయడం తగ్గుముఖం పట్టిందని జీహెచ్‌ఎంసీ కూకట్‌పల్లి జోన్ అధికారి ఒకరు తెలిపారు.
రంగురంగుల పెయింటెడ్ బ్యాక్‌డ్రాప్‌లను ప్రజలు ఆసక్తిగా ఉపయోగిస్తున్నారని, ఇవి ప్రభుత్వ ఆస్తులను పాడుచేయకుండా చెక్‌గా పనిచేస్తున్నాయని అధికారి తెలిపారు. "ఈ గోడలపై కంపెనీలు కూడా వారి ప్రకటనల పోస్టర్లను అతికించడం లేదు." అని అతను చెప్పారు.
జరిమానాలు విధించడం వంటి ఎన్‌ఫోర్స్‌మెంట్ యాక్టివిటీకి బదులుగా, సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేయడం వల్ల సమస్యలను పరిష్కరించడంతోపాటు, వీధులు సౌందర్యవంతంగా తయారవుతున్నాయని అధికారులు అంటున్నారు.