టీఎస్‌పీఎస్సీ ప్రశ్నా పత్రాలు కొనుగోలు చేసిన నలుగురు అరెస్టు

తాజాగా అరెస్టు చేసిన నలుగురు కూడా ప్రవీణ్ నుంచి అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ (ఏఈఈ) ఎగ్జామ్ పేపర్‌ను కొనుగోలు చేసినట్లు గుర్తించారు.

Advertisement
Update:2023-05-09 18:28 IST

తెలంగాణలో సంచలనం రేపిన టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన నియామక పరీక్ష ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో సిట్ అధికారులు మరింత లోతుగా విచారిస్తున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా ప్రధాన నిందితులను ప్రశ్నించిన అధికారులకు.. రోజుకో కొత్త విషయం తెలుస్తున్నది. ప్రధాని నిందితుడైన ప్రవీణ్.. గ్రూప్- 1తో పాటు ఏఈ, ఏఈఈ పరీక్ష పత్రాలను కూడా వేర్వేరు వ్యక్తులకు విక్రయించినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ప్రవీణ్ బ్యాంకు లావాదేవీలు, ఫోన్ డేటా ఆధారంగా ప్రశ్నాపత్రాలు కొనుగోలు చేసిన నలుగురికి పోలీసులు అరెస్టు చేశారు.

తాజాగా అరెస్టు చేసిన నలుగురు కూడా ప్రవీణ్ నుంచి అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ (ఏఈఈ) ఎగ్జామ్ పేపర్‌ను కొనుగోలు చేసినట్లు గుర్తించారు. తొలుత గ్రూప్-1 పేపర్ లీకైందని సిట్ దర్యాప్తు ప్రారంభించగా.. ఆ తర్వాత ఏఈ పేపర్ లీకైనట్లు తేలింది. ఇక సోమవారం ఏఈఈ పేపర్ కూడా బయటకు వచ్చినట్లు పోలీసులు తేల్చారు. ప్రవీణ్ నుంచి ఏఈఈ పేపర్ కొనుగోలు చేసిన వారిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రవీణ్ ఒక్కో పేపర్‌ను రూ.10 లక్షలకు విక్రయించినట్లు తెలుస్తున్నది. ఇప్పటి వరకు సిట్ అధికారులు 24 మందిని అరెస్టు చేశారు. ఈ కేసులో సిస్టమ్ అడ్మిన్ రాజశేఖర్ రెడ్డి బావైన ప్రశాంత్ మినహా అందరూ అరెస్టయ్యారు. ప్రశాంత్ ప్రస్తుతం న్యూజీలాండ్‌లో ఉన్నాడు. అతడి అరెస్టు కోసం కూడా పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు.

కాగా, ప్రశ్నాపత్రాల లీకేజ్ కేసులో ప్రవీణ్ ఒక్కడే పేపర్లను డబ్బులకు అమ్ముకున్నాడని.. ఆ పేపర్లు బయటకు రావడానికి సహకరించిన రాజశేఖర్ రెడ్డి ఎవరికీ విక్రయించలేదని పోలీసులు తేల్చారు. రాజశేఖర్ తన బావ ప్రశాంత్‌కు ఉచితంగానే ఇచ్చాడు. ఇక పేపర్ల లీకేజీ వ్యవహారం బయటకు పొక్కుండా చూసేందుకు టీఎస్‌పీఎస్పీలో ఉద్యోగులైన షమీమ్‌కు కూడా ఫ్రీగానే ఇచ్చాడు. ప్రవీణ్ సురేశ్, రమేశ్‌లకు గ్రూప్-1 పేపర్ ఫ్రీగా ఇచ్చాడు. మిగిలిన అందరి దగ్గర నుంచి భారీగానే వసూలు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. 

Tags:    
Advertisement

Similar News