పీసీసీ మాజీ చీఫ్‌ డీఎస్ ఇకలేరు

డీఎస్‌కు ఇద్దరు కుమారులున్నారు. చిన్న కొడుకు అర్వింద్ ప్రస్తుతం నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు. పెద్ద కొడుకు సంజయ్‌ గతంలో నిజామాబాద్ మేయర్‌గా పని చేశారు.

Advertisement
Update: 2024-06-29 03:00 GMT

పీసీసీ మాజీ చీఫ్‌, కాంగ్రెస్‌ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ (DS) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని తన నివాసంలో తెల్లవారుజామున 3 గంటలకు గుండెపోటు కారణంగా తుదిశ్వాస విడిచారు. డీఎస్‌ మరణవార్తను ఆయన కుమారుడు, నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి సోషల్‌మీడియాలో ప్రకటించారు.

1948 సెప్టెంబర్‌ 27న జన్మించిన డీఎస్‌.. నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. 1989లో నిజామాబాద్ అర్బన్ స్థానం నుంచి పోటీ చేసిన ఆయన తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అనంతరం 1999, 2004లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1989-94 మధ్య గ్రామీణాభివృద్ధి, సమాచార శాఖ మంత్రిగా, 2004-2008 వరకు ఉన్నత విద్య, అర్బన్ లాండ్ సీలింగ్ శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2004, 2009లో పీసీసీ అధ్యక్షునిగా కాంగ్రెస్‌ పార్టీ విజయంలో కీ రోల్ ప్లే చేశారు. 2004లో టీఆర్ఎస్‌తో కాంగ్రెస్‌ పొత్తు కుదర్చడంలోనూ డీఎస్ కీలకంగా పనిచేశారు.

2013 నుంచి 15 వరకు శాసనమండలి సభ్యునిగా ఉన్నారు డీఎస్. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మండలిలో విపక్ష నేతగా కొనసాగారు. రెండోసారి ఎమ్మెల్సీగా అవకాశం రాకపోవడంతో 2015లో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి అప్పటి టీఆర్ఎస్‌లో చేరారు. 2016 నుంచి 2022 వరకు టీఆర్ఎస్ త‌ర‌ఫున రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. రాజ్యసభ సభ్యుడిగా ఉండగానే బీఆర్ఎస్‌ను వీడి తిరిగి కాంగ్రెస్‌ గూటికి చేరారు. డీఎస్‌కు ఇద్దరు కుమారులున్నారు. చిన్న కొడుకు అర్వింద్ ప్రస్తుతం నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు. పెద్ద కొడుకు సంజయ్‌ గతంలో నిజామాబాద్ మేయర్‌గా పని చేశారు.

Tags:    
Advertisement

Similar News