సీఎం రేవంత్‌రెడ్డికి మాజీ ఎంపీ కేవీపీ బహిరంగ లేఖ
తన కుటుంబసభ్యుల ఫార్మ్ హౌస్ విషయంలో చట్టాన్ని తన పని తాను చేసుకుని పోనిద్దామని లేఖలో పేర్కొన్న మాజీ ఎంపీ
సీఎం రేవంత్‌రెడ్డికి మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన మూసీ ప్రక్షాళన, సుందరీకరణను స్వాగతిస్తున్నాను . పార్టీ శ్రేయోభిలాషులు కొందరు మొదటి దశలో మూసీ ప్రక్షాళన చేయాలన్నారు. రెండో దశలో సుందరీకరణ చేపడితే బాగుంటుందని మీకు సూచించాలని కోరారు. మూసీ సుందరీకరణపై మీ ఆసక్తి, సమర్థతను గమనించే మీ దృష్టికి తీసుకురాలేదు. పేదలకు నష్టం లేకుండా మన ప్రభుత్వం చేపట్టే అన్ని పనులు స్వాగతిస్తున్నాను. మూసీ విషయంలో ప్రతిపక్షాలది మొసలి కన్నీరేనని ప్రజలందరికీ తెలుసు.
కొంతమంది నేతలు వారి స్వప్రయోజనాల కోసమే విమర్శలు చేస్తున్నారు. అజీన్‌నగర్‌లో నా కుటుంబసభ్యుల పేరుమీద ఉన్న ఫార్మ్ హౌస్‌పై పదే పదే ఆరోపణలు చేస్తూ.. మీ భుజంపై తుపాకీ పెట్టి నన్ను కాల్చాలని, తద్వారా మిమ్మల్ని ఇబ్బందిపెట్టాలని ప్రయత్నిస్తున్నారు. మీ ఆశయాన్ని దెబ్బతీసే కొంతమంది ప్రయత్నాలను నేను ఖండిస్తున్నాను.
నా కుటుంబ సభ్యులు చెప్పిన ప్రకారం, ఆ ఫార్మ్ హౌస్‌లో ఏ కట్టడమూ ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్ పరిధిలో లేవు. బీఆర్‌ఎస్ వారు నాపై చేసిన ఆరోపణలకు ఆగస్టు 20నే సమాధానం ఇచ్చాను. ఆ ఫార్మ్ హౌస్‌లో ఏ కట్టడమైనా ఒక్క అంగుళం మేరకు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఉన్నా.. నా కుటుంబసభ్యులు తమ సొంత ఖర్చులతో కూల్చడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆరోజే స్పష్టం చేశాను. నా కుటుంబసభ్యులు ఇప్పటికీ ఆ మాటకే కట్టుబడి ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతగా సాధారణ పౌరుడి విషయంలో చట్టం ఎలా ఉంటుందో అలాగే వ్యవహరించాలని ఎలాంటి మినహాయింపులు వద్దని పేర్కొన్నారు. మీరు, నేను కలుగజేసుకోకుండా చట్టాన్ని తన పని తాను చేసుకుని పోనిద్దామని లేఖలో పేర్కొన్నారు.
బహిరంగలేఖ పూర్తి పాఠం కోసం కింది లింక్‌ను క్లిక్ చేయండి