చెప్పుతో కొట్టాలని ఉంది, కానీ.. రేవంత్‌పై బాల్క సుమన్ ఫైర్
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే సీఎం రేవంత్ రెడ్డి అహంకారంతో ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని.. రైతుబంధు డబ్బులు అడిగితే కాంగ్రెస్ మంత్రులు రైతులను చెప్పుతో కొడతామంటున్నారని ఫైర్ అయ్యారు బాల్క సుమన్.
సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్‌పై రేవంత్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాల్క సుమన్.. చెప్పు తీసుకుని కొడతానంటూ ఫైర్ అయ్యారు. కానీ, తనకు సంస్కారం అడ్డువస్తుందన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పద్మనాయక కళ్యాణ మండపంలో జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడిన బాల్క సుమన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
గత ప్రభుత్వ హయాంలో ఏ నాయకుడిని పరుష పదజాలంతో దూషించలేదన్నారు బాల్క సుమన్. కక్ష సాధింపు చర్యలు చేయలేదన్నారు. ఉద్యమ సమయంలో చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి లాంటి ఆంధ్ర ముఖ్యమంత్రులను తట్టుకుని నిలబడ్డ పార్టీ బీఆర్ఎస్ అని చెప్పుకొచ్చారు. ఉద్యమానికి వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్ నాయకులను బీఆర్ఎస్ ప్రభుత్వంలో క్షమించి వదిలేశామని గుర్తుచేశారు. ప్రజాస్వామ్య స్ఫూర్తితో పద్ధతిగా పరిపాలన కొనసాగించామని చెప్పారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే సీఎం రేవంత్ రెడ్డి అహంకారంతో ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని.. రైతుబంధు డబ్బులు అడిగితే కాంగ్రెస్ మంత్రులు రైతులను చెప్పుతో కొడతామంటున్నారని ఫైర్ అయ్యారు బాల్క సుమన్. రైతుబంధు కోసం గత ప్రభుత్వం విడుదల చేసిన రూ.7,700 కోట్లు.. రెవెన్యూ మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌తో పాటు కాంగ్రెస్ కాంట్రాక్టర్ల జేబుల్లోకి వెళ్లాయని ఆరోపించారు. ఆరు గ్యారంటీల్లో ఇప్పటివరకూ ఒక్క గ్యారంటీ కూడా పూర్తిగా అమలు చేయలేదన్నారు. పరిపాలన చేతకాని రేవంత్‌రెడ్డి.. గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారని మండిపడ్డారు బాల్క సుమన్.