ఆ మాట అంటే చెప్పుతో కొడతా.. హరీష్‌ రావు సీరియస్‌

త్వరలో హరీష్‌ రావు మరో ఏక్‌నాథ్‌ షిండే కాబోతున్నారంటూ ఓ రిపోర్టర్‌ అడిగిన ప్రశ్నపై ఆయన మండిపడ్డారు. పదవి కోసం పార్టీలు మారే క్యారెక్టర్ తనది కాదన్నారు.

Advertisement
Update:2024-04-18 10:35 IST

లోక్‌స‌భ‌ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మాజీ మంత్రి హరీష్‌ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన హరీష్‌ రావు.. బీఆర్ఎస్‌ను టీఆర్ఎస్‌గా మార్చాలంటూ ప్రతిపాదనలు వస్తున్నాయన్నారు. ఆ అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ మెజార్టీ స్థానాలు గెలుచుకుంటుందన్నారు.

త్వరలో హరీష్‌ రావు మరో ఏక్‌నాథ్‌ షిండే కాబోతున్నారంటూ ఓ రిపోర్టర్‌ అడిగిన ప్రశ్నపై ఆయన మండిపడ్డారు. పదవి కోసం పార్టీలు మారే క్యారెక్టర్ తనది కాదన్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని వెయ్యి సార్లు చెప్పి ఉంటానని గుర్తుచేశారు. అయినప్పటికీ ఆ రిపోర్టర్‌ మరోసారి బీఆర్ఎస్ కష్టకాలంలో ఉంటే హరీష్‌ ఏక్‌నాథ్‌ షిండే అవుతారంటా అని.. అదే ప్రశ్నను మళ్లీమళ్లీ అడగడంతో ఆయన తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. తాను ఏక్‌నాథ్‌ షిండే అవుతానని ఇకపై ఎవరైనా అంటే వారిని చెప్పుతో కొడతానంటూ ఘాటుగా సమాధానం ఇచ్చారు. పదవిలో ఉన్నా, లేకున్నా తనకు వ్యక్తిత్వం ముఖ్యమన్నారు హరీష్ రావు.


ఏక్‌నాథ్‌ షిండే అయ్యేది రేవంత్ రెడ్డేనని ఆరోపించారు హరీష్‌ రావు. పార్టీలు మారే అలవాటు రేవంత్‌ రెడ్డిదన్నారు. ఢిల్లీ కాంగ్రెస్‌ది ఒక మాట, గల్లీ కాంగ్రెస్‌ది మరో మాట మాట్లాడుతోందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం తమకు లేదని.. ఐదేళ్లు రేవంత్ ప్రభుత్వం కొనసాగాలని కోరుకుంటున్నామన్నారు. రేవంత్ ప్రభుత్వం ఉండదని బీజేపీ నేతలే ఎక్కువగా ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు.

రేవంత్ వ్యవహారశైలిపై కాంగ్రెస్ హైకమాండ్‌కు అనుమానం ఉందన్నారు హరీష్‌ రావు. అందుకే ఏ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలపై రివ్యూ చేయని కేసీ వేణుగోపాల్‌.. హుటాహుటిన ఇటీవల హైదరాబాద్‌కు వచ్చి రివ్యూ చేశారని గుర్తుచేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ గెలిచింద‌ని.. వెంటనే జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తి స్థానాలు బీజేపీ గెలుచుకుందని.. అలాంటి పరిస్థితి ఇక్కడ రిపీటయ్యే అవకాశాలున్నాయన్న అనుమానంతోనే హైకమాండ్ కేసీ వేణుగోపాల్‌ను హైదరాబాద్‌కు పంపిందన్నారు. ఐదు స్థానాల్లో కాంగ్రెస్‌ బీజేపీకి సహకరిస్తుందని కాంగ్రెస్ పార్టీ వర్గాలే అనుమానిస్తున్నాయన్నారు.

Tags:    
Advertisement

Similar News