లగచర్లలో బలవంతపు భూసేకరణను ఆపేయాలి
సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నేతల డిమాండ్
వికారాబాద్ జిల్లా లగచర్లతో పాటు సమీపంలోని గ్రామాల్లో ఫార్మా కంపెనీల కోసం బలవంతపు భూసేకరణ ఆపేయాలని, రైతులపై పోలీసుల నిర్బంధాన్ని తొలగించాలని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నేతలు డిమాండ్ చేశారు. గురువారం న్యూడెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి సాదినేని వెంకటేశ్వర్ రావు, నాయకుడు గోవర్ధన్, పీవోడబ్ల్యూ జాతీయ కన్వీనర్ వి. సంధ్య, ఇఫ్టూ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు జి. అనురాధ, ఎం. శ్రీనివాస్, ఏఐకేఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడాల భిక్షపతి విలేకరులతో మాట్లాడారు. అధికారులపై దాడి చేశారనే నెపంతో రైతులపై కొనసాగిస్తున్న నిర్బంధం అన్యాయమైందన్నారు. అధికారులపై ఎవరు దాడి చేసినా ఖండించాల్సిందేనని, ఆ పేరుతో రైతులపై నిర్బంధాలు పెట్టడం సరికాదన్నారు. తమ భూములు కోల్పోతున్నామనే ఆగ్రహంతోనే లగచర్లలో రైతులు ప్రతిఘటనకు పూనుకున్నారని తెలిపారు. ఈ దాడి రైతుల భూములు బలవంతంగా గుంజుకోవడానికి లైసెన్స్ అన్నట్టుగా ప్రభుత్వ పెద్దలు మాట్లాడటం చట్ట వ్యతరేకమని అన్నారు. ప్రజలు, రైతులను ఒప్పించకుండా, వారికి న్యాయంగా దక్కాల్సిన పరిహారం ఇవ్వకుండా, మరో ప్రత్యామ్నాయం చూపించకుండా భూములు లాక్కోవాలని చూడటం నిరంకుశమని అన్నారు. ఆదిలాబాద్ లో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా, వికారాబాద్ లో దామగుండం నేవీ రాడార్ కేంద్రానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో అనేక చోట్ల ఆందోళనలు కొనసాగుతున్నాయని తెలిపారు. సీఎం నియోజకవర్గంలోనే నిర్వాసిత రైతులకు ఇంత అన్యాయం జరిగి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడం మంచిది కాదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి లగచర్లలో బలవంతపపు భూసేకరణను నిలిపి వేయాలని డిమాండ్ చేశారు.