బెట్టింగ్‌లో రూ.2 కోట్లు పోగొట్టాడని కొడుకును కొట్టి చంపేశాడు

బెట్టింగ్‌లకు అలవాటుపడిన కొడుకు కోట్ల రూపాయలు పోగొట్టాడని తండ్రే కొట్టి చంపేసిన ఘటన శనివారం రాత్రి జరిగింది. మెదక్‌ జిల్లాలోని చిన్నశంకరంపేట మండలం బగిరాత్‌పల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Advertisement
Update:2024-05-12 14:00 IST

బెట్టింగ్‌లకు అలవాటుపడిన కొడుకు కోట్ల రూపాయలు పోగొట్టాడని తండ్రే కొట్టి చంపేసిన ఘటన శనివారం రాత్రి జరిగింది. మెదక్‌ జిల్లాలోని చిన్నశంకరంపేట మండలం బగిరాత్‌పల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

బగిరాత్‌పల్లి గ్రామానికి చెందిన ముఖేష్‌కుమార్‌ (28) రైల్వే ఉద్యోగి. చేగుంట మండలం మల్యాలలో ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ముఖేష్‌ బెట్టింగులు, జల్సాలకు అలవాటుపడటంతో తండ్రి సత్యనారాయణ పలుమార్లు హెచ్చరించారు. అయినా అతను లెక్కచేయకుండా బెట్టింగులు కొనసాగిస్తున్నాడు.

 

మేడ్చల్‌లో ఉన్న ఇళ్లు, ప్లాట్‌ ముఖేష్‌ బెట్టింగ్‌ల వల్లే అమ్మేసినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. ఇప్పటివరకు అతను బెట్టింగ్‌లో రూ.2 కోట్ల వరకు పోగొట్టినట్టు వారు వెల్లడించారు. ఎన్నిసార్లు చెప్పినా మారకపోవడంతో కుటుంబమంతా కుంగిపోతున్నారు. శనివారం రాత్రి ఇదే విషయమై ముఖేష్‌ తండ్రి సత్యనారాయణ మరోమారు బెట్టింగ్‌ల విషయమై నిలదీశారు. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వివాదం పెరగడంతో ఆగ్రహంతో సత్యనారాయణ ఇనుపరాడ్డుతో కుమారుడిపై దాడి చేశాడు. ఈ క్రమంలో ముఖేష్‌ తలపై ఇనుప రాడ్డుతో బలంగా కొట్టడంతో తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News