స్పెషల్‌ బస్సుల్లోనే చార్జీలు పెంచాం

రెగ్యులర్‌ బస్సు చార్జీల్లో మార్పు లేదు.. ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌

Advertisement
Update:2024-10-14 15:36 IST

తెలంగాణ ఆర్టీసీ స్పెషల్‌ బస్సుల్లోనే చార్జీలు పెంచామే తప్ప రెగ్యులర్‌ బస్సుల్లో చార్జీలు పెంచలేదని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ వివరణ ఇచ్చారు. దసరా పండుగ సందర్భంగా ఆర్టీసీ చార్జీలు పెంచలేదని, చార్జీలు పెంచారనే వార్తల్లో వాస్తవం లేదన్నారు. ఈ ప్రచారాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. బ‌తుక‌మ్మ, ద‌స‌రా పండుగ నేప‌థ్యంలో టీజీఎస్‌ ఆర్టీసీ విప‌రీతంగా టికెట్ ధ‌ర‌లు పెంచింద‌ని జ‌రుగుతున్న ప్రచారం తప్పు అని తెలిపారు. ప్ర‌ధాన పండుగులైన సంక్రాంతి, ద‌స‌రా, రాఖీ పౌర్ణ‌మి, వినాయ‌క చ‌వితి, ఉగాది, త‌దిత‌ర స‌మయాల్లో హైద‌రాబాద్ నుంచి ప్ర‌యాణికులు ఎక్కువ‌గా సొంతూళ్ల‌కు వెళ్తుంటారని, ఈ సంద‌ర్బాల్లో ప్రజలకు రవాణా పరంగా ఇబ్బందులు తలెత్తకుండా వారిని క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేసేందుకు స్పెష‌ల్ స‌ర్వీసుల‌ను ఆర్టీసీ యాజ‌మాన్యం నడుపుతోందని తెలిపారు. రద్దీ ఎక్కువ ఉన్న సమయంలో హైదరాబాద్‌ సిటీ బస్సులను కూడా జిల్లాలకు నడుపుతుందని తెలిపారు. తిరుగు ప్రయాణంలో ప్రయాణికుల రద్దీ ఉండదు కాబట్టి ఆ బస్సులు ఖాళీగా వెళ్తుంటాయని వివరించారు. ఆ స్పెష‌ల్ బ‌స్సుల‌కు అయ్యే కనీస డీజిల్ ఖర్చుల మేరకు టికెట్ ధ‌ర‌ను స‌వ‌రించుకోవాలని 2003లో రాష్ట్ర ప్ర‌భుత్వం జీవో నం.16 జారీ చేసిందని తెలిపారు. పండుగ సమయాల్లో నడిపే బస్సు చార్జీలను ఒకటిన్నర శాతం సవరించుకునే వెసులుబాటు ఈ జీవో ద్వారా సంస్థకు ఉందని వివరణ ఇచ్చారు. మ‌హాల‌క్ష్మి ప‌థ‌కం అమ‌లు చేసిన త‌ర్వాత ఆర్టీసీ బ‌స్సుల్లో 25 శాతం మేర ప్రయాణికులు పెరిగారని, గతంతో పోల్చితే సంక్రాంతి, రాఖీ పౌర్ణ‌మి, త‌దిత‌ర పండుగ‌ల‌కు బ‌స్సుల్లో ప్ర‌యాణాలు పెరిగాయన్నారు. కేవలం ఆయా పండుగలకు నడిపించే స్పెషల్‌ బస్సుల్లో మాత్రమే చార్జీలు పెంచడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు.




 


Tags:    
Advertisement

Similar News