కేసీఆర్‌ను ఓడించిన ఎమ్మెల్యేకు బీజేపీ కీలక పదవి
కామారెడ్డిలో కేసీఆర్, రేవంత్ రెడ్డిలను ఓడించి సంచలనం సృష్టించిన కాటిపల్లి వెంకటరమణారెడ్డిని డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా నియమించారు కిషన్ రెడ్డి.
ఎట్టకేలకు శాసనసభాపక్ష నేత పదవిపై బీజేపీ అధికారిక ప్రకటన చేసింది. ఊహించినట్లుగానే నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిని బీజేఎల్పీ లీడర్‌గా ప్రకటించారు రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. రెండోసారి ఎమ్మెల్యేగా గెలవడం, తెలుగు భాషపై పట్టు, అంశాలపై అవగాహన లాంటి అంశాలు ఏలేటికి కలిసొచ్చాయి. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజే ఏలేటికి మద్దతుగా బీజేపీ ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. 2009, 2023లో ఎమ్మెల్యేగా గెలిచారు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి.
ఇక కామారెడ్డిలో కేసీఆర్, రేవంత్ రెడ్డిలను ఓడించి సంచలనం సృష్టించిన కాటిపల్లి వెంకటరమణారెడ్డిని డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా నియమించారు కిషన్ రెడ్డి. ఆయనతో పాటు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్‌ను సైతం రెండో డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా ఎంపిక చేశారు. వీరిద్దరు బీజేపీ శాసనసభాపక్ష నేత పదవికోసం పోటీ పడినవారే కావడం గమనార్హం.
ఇక ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్‌ను బీజేఎల్పీ సెక్రటరీగా నియమించిన కమలనాథులు.. సిర్పూర్ కాగజ్‌నగర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబుకు చీఫ్ విప్ పదవికట్టబెట్టారు. బీజేఎల్పీ విప్‌గా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారయణ గుప్తాను ఎంపిక చేసింది. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డికి ట్రెజరర్‌గా అవకాశం కల్పించింది. బీజేపీ నుంచి 8 మంది గెలవగా రాజాసింగ్ మినహా మిగతా అందరికీ ఏదో ఒక పదవిని కట్టబెట్టారు.