కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై విచారణకు ఈసీ ఆదేశం
ప్రజలందరూ ఓటేసి గెలిపిస్తే జైత్రయాత్ర నిర్వహించడానికి వస్తానని.. లేకపోతే మా కుటుంబ సభ్యుల శవయాత్రకు మీరంతా రావాలని.. సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ ఎన్నికల ప్రచారం చివరి రోజున బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి ఎమోషనల్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. 'మీరు ఓటేసి దీవిస్తే నాలుగో తారీఖున జైత్రయాత్ర.. లేదంటే మా కుటుంబ సభ్యుల శవయాత్రే ' అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని హుజూరాబాద్ ఎన్నికల అధికారులను ఆదేశించింది.
పాడి కౌశిక్ రెడ్డి 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఈటల రాజేందర్ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీఆర్ఎస్‌ను వీడి బీజేపీలో చేరడంతో హుజూరాబాద్‌కు ఉప ఎన్నికలు వచ్చాయి. ఆ సమయంలో కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లోకి జంప్ అయ్యారు.
హుజూరాబాద్ ఉప ఎన్నికలో కౌశిక్ రెడ్డికి కాకుండా గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు బీఆర్ఎస్ టికెట్ కేటాయించింది. కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టింది. అయితే ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధిష్టానం హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పాడి కౌశిక్ రెడ్డిని బరిలోకి దింపింది. దీంతో కౌశిక్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ప్రచారం చేపట్టారు. ఈసారి ఎలాగైనా ఎమ్మెల్యేగా నెగ్గాలని నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు.
ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారం చివరి రోజు అయిన మంగళవారం కౌశిక్ రెడ్డి ఓటర్లను ఉద్దేశించి మాట్లాడుతూ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేశారు. ప్రజలందరూ ఓటేసి గెలిపిస్తే జైత్రయాత్ర నిర్వహించడానికి వస్తానని.. లేకపోతే మా కుటుంబ సభ్యుల శవయాత్రకు మీరంతా రావాలని.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా స్థానిక ఎన్నికల అధికారులను ఆదేశించింది.