వివేక్‌పై ఈడీ కేసు.. వందల కోట్ల ఫ్రాడ్..?
MS విజిలెన్స్ సెక్యూరిటీ సంస్థను వివేక్ వెంకటస్వామి పరోక్షంగా నియంత్రిస్తున్నారు. MS సెక్యూరిటీ సంస్థ ఫెమా నిబంధనలు ఉల్లంఘించిందని తేలింది.
చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎంపీ జి.వివేక్ వెంకటస్వామి ఇళ్లు, కార్యాలయాల్లో జరిపిన సోదాలపై బుధవారం ఈడీ ప్రకటన విడుదల చేసింది. రూ.8 కోట్ల బ్యాంకు లావాదేవీలపై పోలీసుల ఫిర్యాదుతోనే సోదాలు చేసినట్లు స్పష్టం చేసింది. విశాఖ ఇండస్ట్రీస్, MS సెక్యూరిటీ మధ్య రూ.100 కోట్ల లావాదేవీలు జరిగాయని ఈడీ తెలిపింది. ఈ డబ్బు MS సెక్యూరిటీ ఆదాయం కాదని తేల్చింది.
ఈడీ ప్రకటన ఇదే -
MS విజిలెన్స్ సెక్యూరిటీ సంస్థకు వ్యాపారం ద్వారా రూ. 20 లక్షల ఆదాయమే వచ్చింది. ఆస్తులు, అప్పులు కలిపి రూ.64 కోట్లతో బ్యాలెన్స్ షీట్ ఉంది. లావాదేవీలు మాత్రం రూ.200 కోట్లకు పైగా గుర్తించాం. MS విజిలెన్స్ సెక్యూరిటీ సంస్థను వివేక్ వెంకటస్వామి పరోక్షంగా నియంత్రిస్తున్నారు. MS సెక్యూరిటీ సంస్థ ఫెమా నిబంధనలు ఉల్లంఘించిందని తేలింది. ఆ సంస్థకు యశ్వంత్ రియల్టర్స్ మాతృ సంస్థ. యశ్వంత్ రియల్టర్స్‌లో విదేశీయుల షేర్లు ఎక్కువగా ఉన్నాయి.
వివేక్ ఫెమా నిబంధనలు ఉల్లంఘించి విదేశాల్లో సంస్థ ఏర్పాటు చేశారని తెలిపింది ఈడీ. సోదాల్లో భారీగా ఎలక్ట్రానిక్ పరికరాలు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నామని స్పష్టం చేసింది. కంపెనీ లేకుండా వాటిపై కోట్ల ఆస్తులు ఉన్నట్లుగా ఉన్న డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నామని, దర్యాప్తులో భాగంగా విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ బోగస్ అని ఈడీ తెలిపింది.