తెలంగాణలో దుబాయ్ కంపెనీ రూ.700 కోట్ల పెట్టుబడి.. వెల్లడించిన మంత్రి కేటీఆర్

అమెరికా పర్యటన నుంచి తిరిగి వస్తున్న ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం దుబాయ్‌ చేరుకున్నారు. అక్కడే నాఫ్కో యాజమాన్యంతో భేటీ అయ్యారు.

Advertisement
Update:2023-09-05 14:56 IST

తెలంగాణకు మరో భారీ పెట్టుబడి రాబోతున్నది. దుబాయ్ (యూఏఈ)కి చెందిన ఫైర్ సేఫ్టీ ఎక్విప్‌మెంట్ తయారీ కంపెనీ నాఫ్కో (Naffco) రాష్ట్రంలో రూ.700 కోట్ల పెట్టుబడి పెట్టడానికి ఒప్పందం కుదుర్చుకున్నది. అత్యంత ఆధునికమైన స్టేట్ ఆఫ్ ఆర్ట్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్‌ను నాఫ్కో తెలంగాణలో ఏర్పాటు చేయనున్నది. ఈ ప్లాంట్ కోసం రూ.700 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనున్నది.

అమెరికా పర్యటన నుంచి తిరిగి వస్తున్న ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం దుబాయ్‌ చేరుకున్నారు. అక్కడే నాఫ్కో యాజమాన్యంతో భేటీ అయ్యారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు.. పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు వేగంగా ఇస్తున్న విషయాన్ని కేటీఆర్ వారికి వివరించారు. దీంతో ఫైర్ సేఫ్టీ ఎక్విప్‌మెంట్‌లో గ్లోబల్ లీడర్‌గా ఉన్న నాఫ్కో సంస్థ.. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించింది.

కేవలం మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ మాత్రమే కాకుండా.. హైదరాబాద్‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (ఎన్ఏసీ)తో కలిసి ఫైర్ సేఫ్టీ ట్రైనింగ్ అకాడమీని కూడా నెలకొల్పుతామని నాఫ్కో చెప్పింది. నాఫ్కోను తెలంగాణకు సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్(ట్విట్టర్)లో పోస్టు పెట్టారు. నాఫ్కో ప్రతినిధులతో భేటీ అయిన తర్వాత దానికి సంబంధించిన వివరాలను ఇందులో వివరించారు.

నాఫ్కో సంస్థ సీఈవో ఖలీద్ అల్ ఖబిత్‌ను కలవడం చాలా సంతోషంగా ఉన్నది. ఈ సంస్థ అగ్నిమాపక నిరోధక పరికరాలు, వాహనాల తయారీలోనే ప్రపంచంలో లీడర్‌గా ఉన్నదని కేటీఆర్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా 1000కి పైగా సర్టిఫై చేయబడిన ఉత్పత్తులు నాఫ్కో అందిస్తోంది. ఫైర్ ట్రక్స్, అంబులెన్సులు, ఫైర్ అలారమ్స్ వంటి అత్యాధునిక వాహనాలు, పరికరాలు 100కి పైగా దేశాల్లో నాఫ్కో అమ్ముతున్నదని కేటీఆర్ చెప్పారు.

హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్న నాఫ్కో కొత్త ప్లాంట్‌లో ఫైర్ ఇంజన్లు, అంబులెన్సులను తయారు చేస్తుంది. వీటిని దేశీయంగా అమ్మడమే కాకుండా.. ఎగుమతి కూడా చేస్తుందని కేటీఆర్ చెప్పారు.


Tags:    
Advertisement

Similar News