డాక్టర్‌ విజయభారతికి ప్రముఖుల సంతారం

మహాత్మా జ్యోతిరావు ఫూలే,డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జీవిత చరిత్రలను సామాన్య ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన రచయిత్రి

Advertisement
Update:2024-09-28 21:01 IST

ప్రముఖ రచయిత్రి, బొజ్జా తారకం సతీమణి డాక్టర్‌ విజయ భారతి అనారోగ్యంతో కన్నుమూశారు. శుక్రవారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను కుటుంబ సభ్యులు సనత్‌ నగర్‌లోని రెనోవా ఆస్పత్రికి తరలించారు. ఆమె ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో శనివారం తుది స్వాస విడిచారు. విజయభారతి భౌతికకాయాన్ని గాంధీ మెడికల్‌ కాలేజీ వైద్య విద్యార్థుల పరిశోధన కోసం అప్పగిస్తున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఆమె మృతి పట్ల ప్రముఖులు సంతాపం తెలిపారు.

సాహితీ రంగానికి ఆమె చేసిన సేవ‌లు అపార‌మైన‌వి: సీఎం

ప్రముఖ రచయిత్రి, దివంగత పౌర హ‌క్కుల నేత బొజ్జా తార‌కం సతీమణి బి. విజయభారతి మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. విజ‌య‌భార‌తి తెలుగు అకాడ‌మీ డిప్యూటీ డైరెక్ట‌ర్‌గా సేవ‌లు అందించ‌డంతో పాటు ప్రాచీన సాహిత్య కోశం, ఆధునిక సాహిత్య కోశం వెలువ‌రించారని ఈ సందర్భంగా సీఎం గుర్తు చేశారు. సాహితీ రంగానికి విజయభారతి చేసిన సేవ‌లు అపార‌మైన‌వ‌ని అన్నారు. వారి కుటుంబ స‌భ్యుల‌కు ముఖ్య‌మంత్రి ప్రగాఢ సానుభూతి తెలియ‌జేశారు.

మహాత్మా జ్యోతిరావు పూలే జీవిత చరిత్రను తెలుగు సమాజానికి రచయిత్రి: కేసీఆర్‌

సుప్రసిద్ధ కవయిత్రి, రచయిత్రి, అనువాదకురాలు, అంబేడ్కరిస్ట్ డాక్టర్‌ విజయభారతి మరణం పట్ల మాజీ సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. సాహిత్య, సామాజిక అధ్యయనశీలిగా విశ్లేషకురాలిగా డాక్టర్ విజయభారతి చేసిన కృషిని కేసీఆర్ స్మరించుకున్నారు.తెలుగు అకాడమీ మాజీ డైరెక్టర్‌గా సేవలందించిన డాక్టర్‌ విజయభారతి, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ రచనలు, ప్రసంగాల సంపుటాలకు సంపాదకురాలిగా, మహాత్మా జ్యోతిరావు పూలే జీవిత చరిత్రను తెలుగు సమాజానికి మొట్టమొదటిసారిగా అందించిన రచయిత్రిగా వారి కృషి అమోఘమని పేర్కొన్నారు. శోకతప్తులైన వారి కుటుంబసభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

డాక్టర్‌ విజయభారతి ప్రముఖ కవి, రచయిత. పద్మభూషణ్ దివంగత డాక్టర్‌ బోయి భీమన్న పెద్ద కుమార్తె. న్యాయవాది, మానవ హక్కుల నేత అమరుడు బొజ్జా తారకం సహచరి. రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా మాతృమూర్తి.

Tags:    
Advertisement

Similar News