తెలంగాణ భవన్ వద్ద హై టెన్షన్.. దీక్షా దివస్ లో కేటీఆర్ రక్తదానం
కాసేపటి క్రితం తెలంగాణ భవన్ కు చేరుకున్న మంత్రి కేటీఆర్ దీక్షా దివస్ సందర్భంగా రక్తదానం చేశారు. ఆయనతోపాటు మరికొందరు నాయకులు, కార్యకర్తలు రక్తదానం చేశారు. ఎన్నికల కమిషన్ సూచన మేరకు తెలంగాణ భవన్ లోపలే కార్యక్రమాలు నిర్వహించారు.
బీఆర్ఎస్ నేతలు నేడు దీక్షా దివస్ కి ఏర్పాట్లు చేయడంతో తెలంగాణ భవన్ వద్ద ఈ ఉదయం నుంచి టెన్షన్ వాతావరణం నెలకొంది. ఉదయాన్నే తెలంగాణ భవన్ కు ఎలక్షన్ కమిషన్ స్క్వాడ్ చేరుకుంది. కోడ్ అమలులో ఉంది కాబట్టి, తెలంగాణ భవన్‌లో దీక్షా దివస్ కార్యక్రమం చేయొద్దని ఎలక్షన్ స్క్వాడ్ సూచించింది. బీఆర్‌ఎస్ లీగల్ టీమ్ ఇదే అంశంపై ఎలక్షన్ స్క్వాడ్ టీమ్ తో సంప్రదింపులు జరిపింది. అయితే పోలీస్ కమిషనర్ మాత్రం అనుమతి లేదన్నారు. తెలంగాణ తల్లి విగ్రహానికి సైతం పూల మాల వేయవద్దని తేల్చి చెప్పారు. తెలంగాణ భవన్ లోపల కార్యక్రమాలు చేసుకోవాలని సీపీ సూచించారు.
మంత్రి కేటీఆర్ రక్తదానం..
ఈ నేపథ్యంలో కాసేపటి క్రితం తెలంగాణ భవన్ కు చేరుకున్న మంత్రి కేటీఆర్ దీక్షా దివస్ సందర్భంగా రక్తదానం చేశారు. ఆయనతోపాటు మరికొందరు నాయకులు, కార్యకర్తలు రక్తదానం చేశారు. ఎన్నికల కమిషన్ సూచన మేరకు తెలంగాణ భవన్ లోపలే ఈ కార్యక్రమాలు నిర్వహించారు.ఎక్కడా ఎలాంటి రాజకీయ ప్రసంగాలు చేయలేదు.
సిద్ధిపేటలో..
అటు సిద్ధిపేటలో కూడా దీక్షా దివస్ కార్యక్రమం జరిగింది. మంత్రి హరీష్ రావు దీక్షా దివస్ లో పాల్గొన్నారు. దీక్షా దివస్ లో భాగంగా రక్తదానం చేస్తున్న కార్యకర్తల్ని ఆయన అభినందించారు. వారితో కలసి ఫొటోలు దిగారు. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో కూడా దీక్షా దివస్ కార్యక్రమాలు ప్రశాంతంగా మొదలయ్యాయి.