కోదండరాంకు ఎమ్మెల్సీ యోగం లేదా..? దాసోజు శ్రవణ్ కీలక వ్యాఖ్యలు
కేబినెట్ నిర్ణయాన్ని దాసోజు శ్రవణ్ తప్పుబట్టారు. కోర్టు కొట్టివేసిన లిస్ట్ లో ఉన్న పేర్లనే మళ్లీ సిఫార్సు చేస్తే అది చట్టవిరుద్ధం అన్నారు.
తెలంగాణలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకం ఇటీవల తీవ్ర సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. గత బీఆర్ఎస్ ప్రభుత్వ సిఫార్సులను పక్కనపెట్టిన గవర్నర్ తమిళిసై నెలల వ్యవధిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన లిస్ట్ కి ఓకే చెప్పడం, బాధితులు కోర్టుకెక్కడం, కోర్టు తీర్పుతో కాంగ్రెస్ లిస్ట్ కూడా క్యాన్సిల్ కావడం.. ఇలా ఈ ఎపిసోడ్ లో అనేక మలుపులున్నాయి. అయితే కేబినెట్ మరోసారి కోదండరాం, అలీఖాన్ పేర్లను సిఫారసు చేయడంతో కథ సుఖాంతమయిందని అనుకున్నారంతా. కానీ ఇక్కడే మరో ట్విస్ట్ కనపడుతోంది. గవర్నర్ నిర్ణయంతో ఎమ్మెల్సీ ఛాన్స్ కోల్పోయిన దాసోజు శ్రవణ్ మరో లాజిక్ తెరపైకి తెచ్చారు. తెలంగాణ హైకోర్టు కొట్టివేసిన లిస్ట్ ని యథాతథంగా ప్రభుత్వం మళ్లీ గవర్నర్ కి పంపించడం సరికాదని అంటున్నారాయన. అది కోర్టు ధిక్కారం కిందకు వస్తుందన్నారు.
మళ్లీ కేసు వేస్తారా..?
కోర్టు తీర్పు తర్వాత దాసోజు శ్రవణ్, గవర్నర్ కి ప్రత్యేక విన్నపం చేశారు. తనతోపాటు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన లిస్ట్ లో ఉన్న కుర్రా సత్యనారాయణకు ఎమ్మెల్సీలుగా అవకాశమివ్వాలని కోరారు. కానీ అంతలోనే తెలంగాణ కేబినెట్ సమావేశమై, కోదండరాం, అలీఖాన్ పేర్లను రెండోసారి సిఫారసు చేసింది. అయితే కేబినెట్ నిర్ణయాన్ని దాసోజు శ్రవణ్ తప్పుబట్టారు. కోర్టు కొట్టివేసిన లిస్ట్ లో ఉన్న పేర్లనే మళ్లీ సిఫార్సు చేస్తే అది చట్టవిరుద్ధం అన్నారు. మంత్రివర్గ నిర్ణయం హైకోర్టు తీర్పును ఉల్లంఘిస్తూ.. రాజ్యాంగాన్ని అణచివేసే ప్రయత్నంగా పేర్కొన్నారు శ్రవణ్. హైకోర్టు ఆదేశాలకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉండాలని తెలిపారు. ఒకవేళ ప్రభుత్వం మొండిగా ముందుకెళ్తే దాసోజు శ్రవణ్ మరోసారి హైకోర్టుని ఆశ్రయించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం పరిస్థితి ప్రస్తుతం ఇరకాటంలో పడింది. కాంగ్రెస్ కి మిత్రపక్షంగా మారి, ఆ పార్టీ గెలిచి అధికారంలోకి రావడంతో సునాయాసంగా ఎమ్మెల్సీ పదవి పట్టేశారాయన. అయితే దేవుడు వరమిచ్చినా, పూజారి కరుణించలేదన్నట్టుగా కోర్టు తీర్పుతో కోదండరాం ఎమ్మెల్సీ యోగం ఆలస్యమైంది. ఇప్పుడు దాసోజు శ్రవణ్ మళ్లీ కోర్టు మెట్లెక్కితే మొదటికే మోసం వస్తుందేమోననే సందేహం కాంగ్రెస్ నేతల్లో మొదలైంది.