దళిత బంధు దేశానికే ఆదర్శం కావాలి : ప్రకాశ్ అంబేద్కర్

దళిత బంధు పథకం సరికొత్త ప్రయోగం అని ప్రకాశ్ అంబేద్కర్ అభివర్ణించారు. ఈ అద్భుతమైన పథకాన్ని అమలు చేస్తున్న సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Advertisement
Update:2023-04-14 16:30 IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు పథకం దేశానికే ఆదర్శం కావాలని అంబేద్కర్ మనుమడు ప్రకాశ్ అంబేద్కర్ ఆకాంక్షించారు. హైదరాబాద్‌లో నిర్మించిన భారీ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకు ముందు ప్రకాశ్ అంబేద్కర్ హుజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటించారు. రాష్ట్ర ప్రభుత్వం తొలుత పైలెట్ ప్రాజెక్టుగా దళిత బంధును ఆ నియోజకవర్గం అమలు చేసింది. దీంతో ఆయన జమ్మికుంటలో దళిత బంధు యూనిట్ల లబ్ధిదారులను కలిసి, వారితో సమావేశం అయ్యారు.

దళిత బంధు పథకం సరికొత్త ప్రయోగం అని ప్రకాశ్ అంబేద్కర్ అభివర్ణించారు. ఈ అద్భుతమైన పథకాన్ని అమలు చేస్తున్న సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి పథకాన్ని ఇతర రాష్ట్రాలు కూడా అమలు చేస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. దళిత బంధు పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తే ఎంతో మందికి ప్రయోజనం కలుగుతుందని చెప్పారు.

చదువుతో పాటు ఉపాధి కల్పించినప్పుడే దళితుల జీవితాలు మెరుగవుతాయని అన్నారు. 70 ఏళ్లుగా దళితుల జీవనం మెరుగపడక పోవడం చాలా బాధాకరమని అన్నారు. సీఎం కేసీఆర్‌తో సాయంత్రం సమావేశమవుతానని.. ఈ పథకానికి సంబంధించి పలు సూచనలు చేస్తానని అన్నారు. దారిద్ర రేఖకు దిగువన ఉన్న 30 శాతం మంది ప్రజలను కూడా దళిత బంధు పథకంలో భాగం చేయాలని కోరతానని ప్రకాశ్ అంబేద్కర్ వెల్లడించారు.

అంతకు ముందు మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్‌లో ప్రకాశ్ అంబేద్కర్‌కు స్వాగతం పలికారు. ఆయనకు దళిత బంధు విజయగాధలతో కూడిన బుక్ లెట్ అందించారు. అనంతరం ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డితో కలిసి దళిత బంధు యూనిట్లను పరిశీలించారు.

Tags:    
Advertisement

Similar News