ఎన్నికల వేళ ఫ్రీ రీచార్జ్, ఫ్రీ డేటా

ఎన్నికల టైమ్ లో సైబర్ మోసాలు కొత్తపుంతలు తొక్కాయి, ఎలక్షన్ సైబర్ క్రైమ్స్ గా రూపాంతరం చెందాయి.

Advertisement
Update:2023-10-30 11:46 IST

ఎన్నికల వేళ ఫ్రీ రీచార్జ్, ఫ్రీ డేటా

ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకర్షించే ఏ చిన్న ప్రయత్నం కూడా వదులుకోవు. అభ్యర్థుల ఫొటోలతో వాచీలు, గోడ గడియారాలు, కుక్కర్లు.. వంటివి చాలా చోట్ల కనపడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఫోన్ రీచార్జ్ లు, ఉచిత డేటా అనేది కూడా బ్రహ్మాండమైన ఐడియాగా మారింది. నాయకుల సంగతేమో కానీ, వారి పేరు చెప్పుకుని కొంతమంది కేటుగాళ్లు మాత్రం ఫ్రీ రీచార్జ్ లంటూ సామాన్యుల్ని మోసం చేస్తున్నారు.

ఎలక్షన్ సైబర్ క్రైమ్..

ఎన్నికల టైమ్ లో సైబర్ మోసాలు కొత్తపుంతలు తొక్కాయి, ఎలక్షన్ సైబర్ క్రైమ్స్ గా రూపాంతరం చెందాయి. ఫలానా అభ్యర్థి మీ పేరుతో ఉచిత రీచార్జ్ చేశారు, ఆ బెనిఫిట్ పొందాలంటే ఈ లింక్ క్లిక్ చేయండి అంటూ సెల్ ఫోన్లకు మెసేజ్ పంపిస్తున్నారు. స్థానిక అభ్యర్థి పేరుతో వచ్చే ఈ మెసేజ్ లకు వెంటనే ఓటర్లు బుట్టలో పడిపోతారనేది వారి ఆలోచన. నిజంగానే కొంతమంది వీటిపై ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది. అయితే ఇవన్నీ సైబర్ మోసాలని హెచ్చరిస్తున్నారు పోలీసులు. ఎన్నికల వేళ అభ్యర్థులు, పార్టీల పేరుతో వచ్చే మెసేజ్ లను చదివినా.. వాటిపై ఉండే లింకులను క్లిక్ చేయొద్దని సలహా ఇస్తున్నారు. అలా క్లిక్ చేస్తే ఫోన్ కి రీచార్జ్ రాకపోగా, బ్యాంక్ అకౌంట్లోనుంచి డబ్బు మాయం అవుతుందని అంటున్నారు.

ఎలక్షన్ టైమ్ తోపాటు, పండగల సీజన్ కూడా కావడంతో.. కేటుగాళ్లకు అడ్డు అదుపూ లేకుండా పోతోంది. ఫేక్ మెసేజ్ లు సృష్టించి వాటిని వైరల్ చేస్తున్నారు. నిజమేనని నమ్మి ఎవరైనా వాటిని క్లిక్ చేస్తే ఇక అంతే సంగతులు. ఫలానా పార్టీ ఉచితంగా ఇస్తోంది, ఫలానా అభ్యర్థి ఈ గిఫ్ట్ మీకోసం పంపించారు క్లెయిమ్ చేసుకోండి అంటూ మెసేజ్ లు వస్తే అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు. ఆ మెసేజ్ లపై నిఘా పెడతామని కూడా చెబుతున్నారు. తెలంగాణలో ప్రస్తుతానికి ఫేక్ మెసేజ్ లు ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఇప్పటి వరకూ ఎవరూ మోసపోయినట్టు కేసులు నమోదు కాకపోవడం విశేషం. 

Tags:    
Advertisement

Similar News