హైదరాబాద్ లో సీడబ్ల్యూసీ మీటింగ్.. షెడ్యూల్ విడుదల
సీడబ్ల్యూసీ సమావేశంలోనే కాంగ్రెస్ పార్టీ ఐదు గ్యారెంటీలు ప్రకటిస్తుందని తెలిపారు కేసీ వేణుగోపాల్. అంటే తెలంగాణలో కాంగ్రెస్ మేనిఫెస్టో అధికారికంగా ప్రకటించబోతున్నారని తెలుస్తోంది.
ఇటీవల కొత్తగా ఎంపికైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తొలి సమావేశం హైదరాబాద్ లో జరుగుతుంది. ఈమేరకు ఆ పార్టీ ప్రకటన విడుదల చేసింది. ఈనెల 16, 17, 18 తేదీల్లో హైదరాబాద్ లో సీడబ్ల్యూసీ మీటింగ్ జరుగుతుందని తెలిపారు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్. సెప్టెంబర్ 17న తెలంగాణ విలీన దినోత్సవాన్ని కూడా ఘనంగా నిర్వహిస్తామని తెలిపారాయన.
షెడ్యూల్ ఇలా..
16వ తేదీ ఉదయం సీడబ్ల్యుూసీ ప్రతినిధుల సమావేశం
17వ తేదీ సీడబ్ల్యుూసీ సభ్యులు, వివిధ రాష్ట్రాల పీసీసీ ప్రెసిడెంట్స్, సీఎల్పీ నేతల సమావేశం
17 సాయంత్రం హైదరాబాద్ లో భారీ ర్యాలీ
18వ తేదీ తెలంగాణలోని అన్ని నియోజకవర్గాలలో భారత్ జోడో మార్చ్, బీఆర్ఎస్ పై చార్జ్ షీట్ విడుదల
ఐదు గ్యారెంటీలు..
సీడబ్ల్యూసీ సమావేశంలోనే కాంగ్రెస్ పార్టీ ఐదు గ్యారెంటీలు ప్రకటిస్తుందని తెలిపారు కేసీ వేణుగోపాల్. అంటే తెలంగాణలో కాంగ్రెస్ మేనిఫెస్టో అధికారికంగా ప్రకటించబోతున్నారని తెలుస్తోంది. ఒకరకంగా సీడబ్ల్యూసీ మీటింగ్ తో పాటే.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రచారం కూడా ముమ్మరం అవుతుందని చెప్పాలి. కీలక నేతలంతా హైదరాబాద్ తరలి వస్తుండటంతో తెలంగాణ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.
కాంగ్రెస్ లో వైఎస్సార్టీపీ విలీనంపై ఈ సమావేశాల్లో ప్రకటన ఉంటుందా అనే ప్రశ్నకు మాత్రం కేసీ వేణుగోపాల్ సమాధానం దాటవేశారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీతో షర్మిల చర్చలు జరిపారని మాత్రమే అయన తెలిపారు. పార్టీ విలీనంపై వేచి చూడాలని చెప్పారు.