మాతో పొత్తు వల్లే కాంగ్రెస్‌ గెలిచింది..

తన మార్కు లెక్కలు కూడా నారాయణ ఈ సందర్భంగా వివరించారు. అవేంటంటే.. తెలంగాణలో సీపీఐకి 90 నుంచి 100 నియోజకవర్గాల్లో దాదాపు 1000 నుంచి 10 వేల ఓట్ల వరకు ఉంటాయట.

Advertisement
Update:2023-12-19 08:41 IST

తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపొందడానికి తమ పార్టీతో పొత్తే కారణమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అంటున్నారు. అంతేకాదు.. మిగిలిన రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో కూడా తమ పార్టీతో పొత్తు పెట్టుకుని ఉంటే గెలిచేవారని ఆయన చెబుతున్నారు. హైదరాబాద్‌లో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీతో పొత్తు లేకపోవడం వల్లే మిగతా మూడు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓడిపోయిందని చెప్పుకొచ్చారు.

ఈ వ్యాఖ్యలు చేయడమే కాదు.. తన మార్కు లెక్కలు కూడా నారాయణ ఈ సందర్భంగా వివరించారు. అవేంటంటే.. తెలంగాణలో సీపీఐకి 90 నుంచి 100 నియోజకవర్గాల్లో దాదాపు 1000 నుంచి 10 వేల ఓట్ల వరకు ఉంటాయట. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల విజయానికి సీపీఐ ఓట్లు ఎంతో కలిసొచ్చాయట. కాంగ్రెస్‌ పార్టీ రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నప్పటికీ.. ఎన్నికల్లో ఓటమి పాలవడానికి కారణం అదేనని తెలిపారు. ఇక మధ్యప్రదేశ్‌లో కూడా గతంలో వచ్చిన సీట్లను ఆ పార్టీ కోల్పోయిందని చెప్పారు. ఈ విషయం ఆ పార్టీ అధిష్టానం గుణపాఠంగా తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన చెప్పడం గమనార్హం. ముఖ్యంగా ఈ విషయాన్ని ఏఐసీసీ గమనించాలని నారాయణ చెప్పారు.

కాంగ్రెస్‌ గెలిచినా.. ఓడినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఈ సందర్భంగా నారాయణ వ్యాఖ్యానించారు. బీజేపీ ఓటమే తమకు ముఖ్యమని చెప్పారు. ‘ఇండియా’ భాగస్వామ్య కూటమిలోని పార్టీలను కలుపుకుపోవడం కాంగ్రెస్‌ పార్టీకి చాలా ముఖ్యమని నారాయణ చెప్పుకొచ్చారు. ఇక రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కేరళలో 4, తమిళనాడులో 2, పశ్చిమ బెంగాల్‌లో 3, ఛత్తీస్‌గడ్‌ బస్తర్‌తో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఒక్కో లోక్‌సభ స్థానాల్లో సీపీఐ పోటీ చేయనుందని వెల్లడించారు.

ఎన్నికల అవగాహనలో భాగంగా మధ్యప్రదేశ్‌లో ఒక్క స్థానంలో సీపీఐకి అఖిలేష్‌ యాదవ్‌ మద్దతునిస్తున్నారని ఈ సందర్భంగా నారాయణ తెలిపారు. కాంగ్రెస్‌తో మద్దతు కుదిరితే వారితో కలిసి పోటీ చేస్తామని చెప్పారు. మొత్తంగా చూస్తే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీతో పొత్తు కాంగ్రెస్‌కి తప్పనిసరని, కాబట్టి తమకు సీట్లు కేటాయించే విషయంలో తప్పక తమకు అనుకూలంగా వ్యవహరించాల్సి ఉంటుందని నారాయణ హెచ్చరించినట్లు లేవూ.. ఈ వ్యాఖ్యలు?

Tags:    
Advertisement

Similar News