మర్రిపై వేటు, కోమటిరెడ్డి విషయంలో వెనకడుగు.. ఎందుకిలా..?

ఏ స్థాయిలో తిడితే నోటీసు ఇస్తారు, ఏ మోతాదు మించితే సస్పెండ్ చేస్తారు, ఎవరెవరికి ఎన్ని అవకాశాలిస్తారనేది ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో చర్చనీయాంశమవుతోంది.

Advertisement
Update:2022-11-20 18:04 IST

తెలంగాణ కాంగ్రెస్ లో ఇటీవల అలకలు, వలసలు, నోటీసులు, సస్పెన్షన్లు కామన్ గా మారిపోయాయి. అధిష్టానాన్ని ధిక్కరిస్తే వెంటనే సస్పెన్షన్ వేటు వేస్తున్న కాంగ్రెస్, అదే సమయంలో కొంతమంది పట్ల మరీ ఉదారంగా ఉంటోందంటూ ఆరోపణలు ఎదుర్కొంటోంది. తాజాగా జరిగిన రెండు సంఘటనల్లో కాంగ్రెస్ రెండు రకాలుగా స్పందించడంతో కలకలం రేగింది. ఏ స్థాయిలో తిడితే నోటీసు ఇస్తారు, ఏ మోతాదు మించితే సస్పెండ్ చేస్తారు, ఎవరెవరికి ఎన్ని అవకాశాలిస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.

మర్రిపై తక్షణ వేటు..

మర్రి శశిధర్ రెడ్డి పార్టీ మారతారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన మెడలో కాషాయ కండువా పడకముందే కాంగ్రెస్ అధిష్టానం సస్పెన్షన్ వేటు వేసింది. కాంగ్రెస్ కి క్యాన్సర్ సోకిందంటూ తీవ్ర ఆరోపణలు చేసిన మర్రిపై అధిష్టానం కఠిన చర్యలే తీసుకుంది. అయితే అంతకు ముందు పార్టీపై విరుచుకుపడ్డ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి మాత్రం ఎందుకు అన్ని అవకాశాలిస్తోందనేదే ఇప్పుడు తేలాల్సిన అంశం.

నోటీసులతో సరి..

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా 3 నెలల క్రితం కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను కలిశారు. ఆ తర్వాత పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని చాలా సార్లు నేరుగానే విమర్శించారు. కాంగ్రెస్ తెలంగాణ ఇన్ చార్జి మాణిక్కం ఠాగూర్ ని కూడా దుమ్మెత్తిపోశారు. ఇటీవల మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనంగా మారాయి. కాంగ్రెస్ ఓడిపోతుందని, బీజేపీ అభ్యర్థి అయిన తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి ఓటు వేయాలంటూ ఆయన తన వర్గానికి పిలుపునివ్వడంపై అధిష్టానం మొదట సీరియస్ అయినా, తర్వాత చల్లబడింది. నోటీసులతో సరిపెట్టింది, వెంకట్ రెడ్డి ఇచ్చిన సమాధానానికి సంతృప్తి చెందింది.

ఎందుకిలా..?

వెంకట్ రెడ్డి అంత సీన్ చేసినా నోటీసులతో సరిపెట్టిన అధిష్టానం, శశిధర్ రెడ్డి ఇంకా పక్క పార్టీ కండువా కప్పుకోకముందే వేటు వేయడమేంటని తెలంగాణలో వైరివర్గాలు కాంగ్రెస్ ని కార్నర్ చేశాయి. శశిధర్ రెడ్డి పార్టీ మారడం ఖాయం అని తేలిపోయిన తర్వాత అధిష్టానం ఉపేక్షించదలచుకోలేదు, వెంకట్ రెడ్డి వివరణ సహేతుకంగా ఉంది కాబట్టి ఆయనకు మరో అవకాశమిచ్చామని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి. దీనిపై రాద్ధాంతం ఎందుకని ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ నేతలు.

Tags:    
Advertisement

Similar News